![Praneeth Rao Phone Tapping Case: SIT Investigate MLC Involvements - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/26/phonetaping.jpg.webp?itok=IKy2uyO-)
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి నిత్యం కొత్త వ్యక్తుల పేర్లు తెరమీదకు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు తేలింది.
ఎమ్మెల్సీ పాత్రపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇజ్రాయిల్‌లో అధునాతన పరికరాలు కొని హైదరాబాధ్‌కు రప్పించడంలో ఎమ్మెల్సీ కీలక పాత్ర వహించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎమ్మెల్సీ తన పలుకుబడితో రవిపాల్‌తో ట్యాపింగ్ డివైజ్‌లను తెప్పించినట్లు గుర్తించారు.
అదే విధంగా ఎస్‌ఐబీ కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి. ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం.
చదవండి: ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే..
మరోవైపు ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో రవిపాల్ కీలకంగా మారారు. ఎస్‌ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్ నేతృత్యంలోనే ట్యాపింగ్ డివైజ్‌లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా డివైజ్‌ను తీసుకొచ్చిన రవిపాల్, ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి ట్యాపింగ్ డివైజ్‌లు దిగుమతి చేసినట్లు సమాచారం. ఇందుకు రవిపాల్‌కు ఎస్‌ఐబీ కోట్లలో డబ్లులు చెల్లించినట్లు తెలిసింది.
రవిపాల్, ప్రభాకర్ కలిసి ఆధునాతన డివైజ్‌లను దిగుమతి చేసుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. 300 మీటర్ల పరిధిలో మాటలను వినే వీలున్న డివైజ్‌లు తెచ్చిన రవిపాల్ ..రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఆఫీస్ తీసుకొని డివైజ్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రేవంత్ ఇంట్లో జరిగే ప్రతి విషయన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్‌రావు, రవిపాల్ విన్నారు. ఈ క్రమంలో రవిపాల్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment