అంబులెన్స్‌లో పండంటి మగబిడ్డతో లక్ష్మి
వేమనపల్లి (బెల్లంపల్లి): ఓ నిండు గర్భిణి 12 గంటల పాటు ప్రసవ వేదన అనుభవించింది. ఆసుపత్రికి వెళ్లేందుకు దారి లేక.. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటలేక ఆ మహిళ నరకయాతన పడింది. చివరకు జోరు వానలో వాగు వద్దే ప్రసవించింది. బుధవారం మంచిర్యాల జిల్లా వేమనపల్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెం దిన కోండ్ర లక్ష్మికి మంగళవారం రాత్రి 8 గంటలకు పురిటినొప్పులు ప్రారంభం కావడంతో కుటుంబసభ్యులు అదే గ్రామంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో పొరుగున ఉన్న చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు.
అయితే వరద కారణంగా అప్పటికే బద్దెల్లివాగుపై నిర్మించిన వంతెన తెగిపోయింది. మరోమార్గం మీదుగా వెళ్లాలన్నా ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా సాహసం చేసి అదే రాత్రి ఆటోలో బద్దెల్లివాగును దాటేందుకు ప్రయత్నించా రు. కుండపోతగా కురుస్తున్న వర్షంతో వాగు ప్రమాదకరంగా మారింది. దీంతో చే సేదిలేక ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ఆమె వేదన చూడలేక కోటపల్లి మండలం వెంచపల్లి మీదుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ.. ప్రాణహిత నది కూడా ఉప్పొంగడంతో మళ్లీ ఇంటికి చేరారు. ఇలా రాత్రంతా ఆమె నొప్పులతోనే అల్లాడింది.
వాగు వద్దే ప్రసవం
బుధవారం ఉదయం లక్ష్మిని మళ్లీ ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బద్దెల్లి వాగువద్దకు వచ్చారు. లక్ష్మిని ఆమె భర్త మహేశ్ మిత్రుల సహాయంతో అతికష్టం మీద వాగు దాటించారు. అప్పటికే సమయం మించిపోవడంతో వాగుదాటిన కొద్దిసేపటికే లక్ష్మి జోరు వర్షంలోనే వాగు ఒడ్డున మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత వాగు వద్దకు 108 అంబులెన్స్ రాగా.. బాలింతకు, బిడ్డకు వైద్యం అందించి ఇద్దరినీ చెన్నూరుకు తరలించారు.
కలెక్టర్ ఆదేశించినా..
మూడు రోజుల క్రితం కలెక్టర్ భారతిహోళీకేరి బద్దెల్లివాగు వద్దకు వచ్చారు. రాకపోకల సదుపాయం లేని ముల్కలపేట గ్రామంలో గర్భిణులు ఉంటే సంబంధిత అధికారులు తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వర్షాలు అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులను వాగు దాటించి కాన్పు అయ్యేలా చూడాలని మండల అధికారులను హెచ్చరించారు. కానీ.. లక్ష్మి 12 గంటలపాటు ప్రసవవేదనతో అల్లాడినా ఏ ఒక్క అధికారి కూడా కనీసం అటువైపు రాలేదని విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment