సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువగా ప్రాథమిక వైద్య సేవలు అందించేలా తెలంగాణ సర్కారు దృష్టి సారించింది. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా నడుస్తుండగా, ఇతర పట్టణాల్లోనూ నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. బస్తీ దవాఖానాల్లో ఒక డాక్టర్, నర్సు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. దాదాపు ఐదు వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. హైదరాబాద్‌లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే 2 నడుస్తున్నాయి. ప్రస్తుతం వాటిల్లో 65 రకాల పరీక్షలు చేస్తున్నారు. గతేడాది డెంగీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఇకనుంచి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ మోడల్‌గా పూర్వ జిల్లా కేంద్రాల్లోనూ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ( చదవండి: తెలంగాణ: సర్కారీ మెడికల్ షాపులు! )
ఉప కేంద్రాలే వెల్‌నెస్ సెంటర్లు...
పల్లెవాసులకు మెరుగైన వైద్యసేవల కోసం ఆరోగ్య ఉప కేంద్రాల బలోపేతంపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో 4,905 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిని హెల్త్ వెల్‌నెస్ సెంటర్లుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. వీటిలో ఏఎన్‌ఎంలే ప్రస్తుతం కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం టీకాలు ఇవ్వడం, గర్భిణులు, పిల్లలకు మందులివ్వడంలాంటి సేవలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో త్వరలో నర్సులను నియమించి, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. షుగర్, బీపీ చెక్ చేయడంతోపాటు ఇతర వైద్య సేవలు అందించేలా వీటిని బలోపేతం చేస్తారు. పైగా నర్సులకు ప్రత్యేకంగా మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎంఎల్‌హెచ్‌పీ) హోదా ఇస్తారు. నర్సులుగా నియమితులవ్వడానికి బీఎస్సీ నర్సింగ్ అర్హతగా నిర్ణయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కిందిస్థాయిలో ఇవి పనిచేస్తాయి. రోగులను ఉప కేంద్రాల నుంచి వీటికి రిఫర్ చేస్తారు. వీటిల్లోనూ మున్ముందు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఒక వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి తెలిపారు.
మరింత మెరుగ్గా ప్రాథమిక వైద్యం
Published Fri, Nov 13 2020 8:25 AM | Last Updated on Fri, Nov 13 2020 8:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment