సభ ప్రాంగణం వద్ద ఏర్పాట్లు
సభకు పొంచి ఉన్న వర్షం గండం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ జగిత్యాలకు రానున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సోమవారం జగిత్యాలలోని గీతా విద్యాలయ మైదానంలో విజయ సంకల్పసభ పేరుతో నిర్వహించతలపెట్టిన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా ఏర్పాట్లను నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌సీజీ)తోపాటు పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. సభ బందోబస్తుకు 1,600 మందికిపైగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే హెలికాప్టర్ల ల్యాండింగ్ ట్రయల్స్, కాన్వాయ్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు.
మైదాన పరిసరాలను పూర్తిగా ఎన్‌ఎస్‌జీ బలగాలు తమ అ«దీనంలోకి తీసుకున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, పీఎఫ్‌ఐ, ఐఎస్‌ఐ తదితర ఉగ్రవాద సానుభూతిపరులకు పట్టున్న ప్రాంతం కావడంతో కేంద్ర, రాష్ట్ర అధికారులు భద్రత విషయంలో ఎక్కడా రాజీపడటం లేదు. అయితే జగిత్యాల విజయసంకల్ప సభకు వర్షం గండం పొంచి ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, 30–40 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వర్షం, ఈదురుగాలుల హెచ్చరిక నేపథ్యంలో అధికారులు హెలికాప్టర్ ల్యాండింగ్, కాన్వాయ్ మూమెంట్ విషయంలో ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment