సాక్షి,ఆదిలాబాద్‌టౌన్: వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలో నీళ్ల దందా షురూ అవుతుంది. పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలుస్తాయి. అయితే వీటికి అనుమతులు ఉండవు.. ప్రమాణాలు పాటించరు.. నిర్వహణ సైతం ఇష్టారీతిన కొనసాగుతోంది. రక్షిత నీటిని తాగాలన్న ప్రజల బలహీనతను ఆసరా చేసుకుని ప్యూరిఫైడ్ పేరిట కొందరు ఏటా లక్షలాది రూపాయలు అర్జిస్తున్నారు. క్యాన్లలో కలుషిత నీటిని అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఐఎస్‌ఐ అనుమతి ఉండి రెన్యూవల్ చేసుకోని వాటర్‌ప్లాంట్లు 20 వరకు ఉండగా జిల్లా వ్యాప్తంగా వీటి సంఖ్య దాదాపు 700లకు పైగానే ఉంది. అయితే ఇందులో ఒక్క ప్లాంట్ కూడా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. వీటికి అనుమతులు సైతం లేకపోవడం గమనార్హం. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. ఈ ప్లాంట్లలో పాత యంత్రాలు వాడటం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటం, జలాన్ని శుద్ధి చేయకుండానే సాధారణ నీటినే క్యాన్లలో సరఫరా చేస్తున్నారు. ఇలాంటి నీటిని తాగితే రోగాల బారిన పడడం ఖాయమంటున్నారు వైద్య నిపుణులు.
ప్రమాణాలు పాటించని వైనం..
భారత ప్రమాణాల సంస్థ (ఐఎస్‌ఐ) నిబంధనలు ఏ ఒక్కటీ అమలు కావడం లేదు. జిల్లాలో సుమారు 700 వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కదానికి కూడా అనుమతి లేదు. ఇళ్లల్లో, దుకాణాల్లో, పాత గదుల్లో ప్లాంట్లను నిర్వహిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క ప్లాంట్‌లో కూడా నీటి నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. మైక్రోబయోలజిస్ట్, కెమిస్టులు అందుబాటులో ఉండడం లేదు. జిల్లాలో ఏటా ఈ ప్లాంట్ల నిర్వాహకులకు మొత్తంగా సుమారు రూ.25 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. దీంతో ఏడాదికేడాది వాటర్ ప్లాంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
గతంలో పట్టణాలకు పరిమితమైన వాటర్‌ప్లాంట్లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాయి. వాటర్ క్యాన్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. వాస్తవంగా 20 లీటర్ల నీరు శుద్ధి చేయడానికి రూ.2 నుంచి రూ.3 మాత్రమే ఖర్చవుతుంది. ఈ క్రమంలో ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువగా ఉన్న ఈ వ్యాపారం వైపు మొగ్గుచూపుతున్నారు. కొన్ని ప్లాంట్లలో క్యాన్‌లు శుద్ధి చేయకుండానే సాధారణ నీటిని నింపి సరఫరా చేస్తున్నారు. కాలం చెల్లిన క్యాన్‌లు ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
నిబంధనలు ఇవే..
►వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలి.
► పరిశ్రమల శాఖ నుంచి పార్టు–1 లైసెన్సు పొందాలి.
► బీఎస్‌ఐ అనుమతి ఉండాలి. ఐఎస్‌ఐ నిబంధనలు పాటించాలి.
► ప్లాంట్‌లో మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి.
► పీహెచ్ స్థాయి 7 కంటే తగ్గకుండా చూడాలి. తగ్గితే ఆ నీరు తాగిన వారికి కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.
► నీటిని క్యాన్లలో నింపేవారు చేతులకు తొడుగులు ధరించాలి.
► ప్లాంట్‌లో ప్రయోగశాలతో పాటు ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి.
► క్యాన్లు పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు పొటాషియం పర్మాంగనేట్‌తో కెమికల్ క్లీనింగ్ చేయాలి.
► ప్రతి క్యాన్‌పై శుద్ధి చేసిన తేదీ, బ్యాచ్ నంబర్ ఉండాలి.
► మినరల్ వాటర్‌ను క్యానులో పట్టే ముందు అల్ట్రా వైరస్ రేస్‌తో శుద్ధి చేయాలి. నీటిని క్యాన్‌లోకి పట్టిన తర్వాత రెండు రోజుల పాటు భద్రపరిచి, మార్కెట్‌లోకి పంపాలి.
► శుద్ధి చేసిన నీటిని 304 గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన పెద్ద ట్యాంకులో నింపి ఓజోనైజేషన్ చేయాలి.
► ప్రతి మూడు నెలలకోసారి రా వాటర్ టెస్టింగ్ జరపాలి. ప్లాస్టిక్ బాటిల్స్, ప్యాకెట్లలో నిర్ణీత మైక్రోన్స్ ఉండాలి.
తనిఖీ నిర్వహిస్తాం
అనుమతి లేకుండా కొనసాగిస్తున్న వాటర్‌ప్లాంట్లలో తనిఖీలు నిర్వహిస్తాం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుంటాం. కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేని వాటిని మూసివేయిస్తాం.
– జాడి రాజేశ్వర్, ఆర్డీఓ, ఆదిలాబాద్
అనారోగ్య సమస్యలు..
ప్యూరిఫైడ్ పేరిట రక్షితం కాని నీటిని తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్యూరిఫైడ్ ప్లాంట్లలో క్యాన్‌లు నింపే సమయంలో వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లవణాలు మోతాదులో ఉండే నీటిని నింపాలి. రోజుల తరబడి క్యాన్‌లను శుభ్రం చేయకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు వస్తాయి. డయేరియా, వాంతులు, విరోచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. క్లోరినేషన్ సరిగా చేయకుండా నీటిని నింపితే ప్రమాదకరం.
– క్రాంతికుమార్, ఎండీ, ఫిజీషియన్, రిమ్స్
Comments
Please login to add a commentAdd a comment