TIME: 08: 10PM
తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తుపెట్టుకోదని స్పష్టం చేశారు. తెలంగాణను దోచుకున్న వారితో పొత్తులుండవ్ అని తెలిపారు. పొత్తు గురించి కాంగ్రెస్ నేతలు ఎవరు మాట్లాడినా పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు కొరుకునే కాంగ్రెస్ నేతలు ఎవరైనా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లి పొవచ్చని అన్నారు. ఇక వరంగల్ సభా వేదికగా సొంత పార్టీ నేతలకు రాహుల్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ విధానాలు విమర్శిస్తే సహించేది లేదని, ఎంత పెద్ద వారైనా పార్టీ నుంచి బయటకు నెట్టేస్తామని హెచ్చరించారు. ప్రజా సేవ చేస్తున్న వారికే టికెట్లు ఇస్తామని తెలిపారు.
TIME: 08: 00PM
తెలంగాణ సీఎం రైతుల కష్టాలు వినట్లేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదని, రాష్ట్రంలో రాజరికం నడుస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రైతుల బాధ వినడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులు ఆందోళన చెందవద్దని, అధికారంలోకి వచ్చాక రూ 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇవి ఒట్టిమాటలు కావు, తెలంగాణ కలలు నెరవేర్చే మొదటి అడుగని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చిందని గుర్తు చేశారు.
రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతిహామీని నెరవేరుస్తాం
‘తెలంగాణలో నడుస్తోంది బీజేపీ రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం. తెలంగాణలో బీజేపీ గెలవలేక ఇలా చేస్తోంది. టీఆర్‌ఎస్ ఎంత దోచుకున్నా.. ఈడీ లేదు, ఐటీ లేదు. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు రాలేదు. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిది? తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న దొంగ ఎవరు? కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చాం. తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు.. రాజు ఉన్నాడు. తెలంగాణ ఇస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందనుకున్నాం. రైతు డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతిహామీని నెరవేరుస్తాం’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.
TIME: 07: 45PM
తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్లనో రాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఒక్కరి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని అన్నారు. తెలంగాణ వల్ల ఒకే కుటుంబం బాగుపడిందన్నారు. ఎంతోమంది త్యాగాలతో తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు.. ఈ వేదిక మీద భర్తల్ని పోగొట్టుకున్న రైతు కుటుంబాలు ఉన్నాయని, వీరి వేదనకు ఎవరు కారణమని ప్రశ్నించారు. ఇటువంటి బాధిత రైతులు రాష్ట్రమంతా ఉన్నారన్నారని, తెలంగాణ కల సాకారం చేసుకోవడానికి రక్తాన్ని, కన్నీళ్లను చిందించారని ప్రస్తావించారు. తెలంగాణ ప్రజల కలను నెరవేర్చింది కాంగ్రెస్‌యేనని స్పష్టం చేశారు.
TIME: 07: 30PM
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. తెలంగాణ అంటే పేగు బంధం.. ఆత్మ గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ అంటే ఎన్నికల ముడి సరుకు కాదని అన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా, చేసే వారిపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు.
‘అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తాం. ఏటా కౌలు రైతులకు 15 వేల ఆర్థిక సాయం. భూమి లేని రైతులకు రూ. 12 వేల సాయం. అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇస్తాం. ఆదివాసీలకు పోడు భూముల్లో హక్కు పట్టాలిస్తాం. రైతు పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం’ అని వ్యాఖ్యానించారు..
TIME: 07: 10PM
కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దోపిడీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతు బంధు పేరు చెప్పి అన్నింటినీ బంద్ చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌కు బుద్ధిచెప్పడం కోసమే ఈ సభా అని అన్నారు. రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మోదీ వల్ల రైతుల ఆదాయం తగ్గిపోయందన్నారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇది తొలిమెట్టు అని అన్నారు.
TIME: 06: 50PM
వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభా వేదిక వద్దకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్‌కు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను రాహుల్ పరామర్శించారు.
TIME: 06: 20PM
► కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. రాహుల్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకున్నారు.
TIME: 05: 30PM
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాహుల్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘన స్వగతం పలికారు. అనంతరం శంషాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్‌కు బయల్దేరారు. మొదట వరంగల్ గాబ్రియల్‌కు స్కూల్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్‌జీపులో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌కు వెళ్లనున్నారు. సాయంత్ర 7 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వరంగల్‌లో సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ పయనం కానున్నారు.
అంతకుముందు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సభలో రైతు డిక్లరేషన్‌పై రాహుల్ గాంధీ ప్రకటన చేస్తారని తెలిపారు. తెలంగాణలో కొత్త వ్యవసాయ విధానంపై డిక్లరేషన్ ఉండబోతోందని పేర్కొన్నారు. అయితే రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించనున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అదే విధంగా రాహుల్ గాంధీ టీ కాంగ్రెస్‌కు ఏ విధంగా దిశానిర్ధేశం చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
యువత, రైతులే ప్రధాన కేంద్రంగా ఈ సభ జరగనుంది. రాహుల్ రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్‌శ్రేణులు వేలాదిగా తరలి వెళ్తున్నారు. టీ కాంగ్రెస్ నేతలు సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, మెదక్, నల్లగొండ, కరీంనగర్ నుంచి భారీగా తరలి వస్తున్నార. నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండు వేల వాహనాల్లో జనాన్ని తరలిస్తున్నారు.
చదవండి: రాహుల్ తెలంగాణ టూర్‌లో మరో షాక్
Comments
Please login to add a commentAdd a comment