
సాక్షి, ఢిల్లీ: కొత్త ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు నిరంతర ప్రక్రియ అని, ఆయా ప్రాంతాల్లో ఈఎస్ఐ సభ్యుల సంఖ్య, తదితర వివరాల ఆధారంగా ఆస్పత్రి ఏర్పాటు జరుగుతుందని కేంద్ర కార్మికశాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్ ఎంపీ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 160 ఈఎస్ఐ ఆస్పత్రులు ఉన్నాయని, వాటిలో 50 ఆస్పత్రులను ఈఎస్ఐ కార్పొరేషన్ నిర్వహిస్తుండగా, 110 ఆస్పత్రులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఈఎస్ఐ డైరక్టరేట్లు నిర్వహిస్తున్నాయని తెలిపారు.
2019లో ఒడిశాలోని అంగుల్, ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో ఈఎస్ఐ ఆస్పత్రుల ఏర్పాటు జరిగిందని చెప్పారు. 2020లో కోర్బా(చత్తీస్‌గఢ్), ఉదయ్‌పూర్(రాజస్థాన్), రాయ్‌పూర్(చత్తీస్‌గఢ్)లో ఏర్పాటు చేశామని తెలిపారు. 2021లో కొత్త ఈఎస్ఐ ఆస్పత్రులను నెలకొల్పలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూర్యాపేట సహా మరెక్కడైనా ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగులో లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment