సాక్షి, సిటీబ్యూరో: ఆ క్షణంలో ప్రతి ఒక్కరిలో భయం గూడుకట్టుకొంది. ఇప్పట్లో అమెరికా నుంచి హైదరాబాద్‌కు వెళ్లగలమా అనే ఆందోళన. అప్పటికే అమెరికా అంతటా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయాయి. ‘ఎట్లయినా సరే అమెరికా దాటి వెళ్లాలి’. చదువుకొనేందుకు, ఉద్యోగాలు చేసేందుకు వెళ్లిన ఎంతోమంది యువతీయువకులు.. అమెరికాలో స్థిరపడిన తమ కొడుకులు, కూతుళ్ల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు, పుట్టింట్లో పురుడు పోసుకోవాలని ఎదురు చూసే గర్భిణులు ...అందరి ఆలోచన ఒక్కటే. ఎలాగైనా సరే అమెరికా నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలి. కానీ ఎలా... అదిగో సరిగ్గా ఆ సమయంలో ‘నేనున్నానంటూ’ వచ్చారు రవి పులి. అమెరికాలో తనకున్న పరిచయాలను, పలుకుబడితో చార్టెడ్ ఫ్లైట్‌లను ఏర్పాటు చేశారు. టిక్కెట్‌లు కొనుగోలు చేయలేని నిరుద్యోగులకు అండగా నిలిచారు. అందరినీ హైదరాబాద్ విమానం ఎక్కించారు. 250 మందికి పైగా తెలుగు వారిని హైదరాబాద్‌కు తరలించడంలో ఎంతో కృషి చేశారు. (కరోనా కేసులు, ఫలితాలే కీలకం )
పల్లె పరిమళం పదిలం...
నిజానికి పదమూడు మంది పిల్లలు ఉన్న ఒక ఇంట్లో వారిని పెంచి పోషించడమే ఆ తల్లిదండ్రులకు చాలా కష్టమైన పని.అలాంటి ఇంట్లో రవి 10వ సంతానం. అక్కచెల్లెళ్లు,అన్నదమ్ములు గంపెడు మందితో పాటు కలిసి పెరిగాడు. తండ్రి రాజయ్య. గీత కార్మికుడు. తల్లి బుచ్చమ్మ. ఆ వృత్తే వారి జీవనాధారం. ‘ ఒక్కోసారి పస్తులున్నాం.మమ్మల్ని పోషించడం కోసం నా తల్లిదండ్రులు పడిన కష్టాలు బాగా తెలుసు. ఇప్పుడు మా నాన్న లేరు. అమ్మ ఊళ్లోనే ఉంటుంది. తరచుగా ఊరికెళ్తాను. జీవితంలో నన్ను గెలిపించింది నా కాటాపురమే.అందుకే నాకు నా ఊరంటే ఎంతో ఇష్టం.’ అంటారు.
అమ్మ ఫోన్‌తో...
‘అమ్మ భయాందోళనతో ఫోన్ చేసింది. ఊరుకు రమ్మని చెప్పింది. ఆ పిలుపులోని ఆవేదన నాకు తెలుసు. కానీ ఎంతోమంది విద్యార్థులు, ఉద్యోగార్థులు అమ్మా నాన్నలు పిలిచినా హైదరాబాద్‌కు వెళ్లలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్లందరినీ పంపించకుండా నేను మాత్రమే ఎలా వెళ్లగలను’ అంటారు రవి పులి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కానీ ఇప్పుడు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోనే ఒక ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్త. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల అంతర్జాతీయ సదస్సులో ఇవాంకతో పాటు వచ్చిన పారిశ్రామికవేత్తల బృందంలో రవి పులి కూడా ఉన్నారు. కానీ ‘ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలన్నట్లు..’ ఆయన తన ‘స్థాయి’ని అమెరికాలో ఉన్న తెలుగువారికి మరింత చేరువ చేశారు.
తెలంగాణ నుంచి విద్య,ఉద్యోగాల కోసం వెళ్లే యువతీ యువకులకు ‘రవన్న’ గొప్ప ధీమా. ఆయన వాషింగ్టన్‌లో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూపు’ నిరుద్యోగులకు అండగా నిలుస్తుంది.‘హైదరాబాద్‌లో ఎంతో కష్టపడి చదువుకున్నాను. మారుమూల పల్లెటూళ్లో , ఒక సాధారణ కుటుంబంలో పుట్టిపెరిగిన నాకు ఆ కష్టాలు కొత్త కాదు. కానీ నాలాగా మరొకరు కష్టపడొద్దని భావిస్తాను. అందుకే అమెరికాకు వచ్చే హైదరాబాద్ వారికి, తెలంగాణ విద్యార్ధులకు ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూపు ఉద్యోగావకాశాల్లో సహాయ సహకారాలు అందజేస్తుంది. అలాగే సాఫ్ట్‌వేర్ సంస్థలను ఏర్పాటు చేయాలనుకొనే ఔత్సాహికులకు ప్రోత్సాహాన్నిస్తుంది.’అని చెప్పారు.
సాధారణ కుటుంబం నుంచి..
‘ఒక పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అమెరికా నాకు ఒక అవకాశం ఇచ్చి ఉండవచ్చు. కానీ నా అస్థిత్వం మాత్రం నేను పుట్టిపెరిగిన పల్లెలోనే ఉంది.అది ములుగు జిల్లాలోని కాటాపురం. హన్మకొండకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది’ అని చెప్పారు. నిజానికి 40 ఏళ్ల క్రితం అది కీకారణ్యమే.ఆ పల్లె ప్రజలకు ‘అమెరికా’ అనే ఆలోచనే ఊహకందనిది. కానీ రవి ఆ ఊహను నిజం చేశారు. అమెరికా కలను సాకారం చేసుకున్నారు. ఇప్పుడు తనతో పాటు అనేక మందికి ఉపాధి మార్గంగా నిలిచారు. ‘ఇప్పుడు రోడ్లు,రవాణా సదుపాయాలు. మెబైల్ ఫోన్‌లు, ఇంటర్నెట్ వచ్చాయి. కానీ ఆ రోజుల్లో అడవి దాటి తాడ్వాయికి చేరుకొని అక్కడ బస్సెక్కి హన్మకొండకు వెళ్లి చదువుకొనేవాన్ని. చదువుకోవడమే కష్టం.కానీ జీవితంలో పైకెదగాలంటే నా వంటి పేదవాడికి చదువు తప్ప మరో అవకాశం లేదు కదా....’ అని చెప్పారు.
హన్మకొండలో చదువు పూర్తయిన తరువాత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ‘అమెరికా కలల’కు ఊపిరిలూదారు.‘ అప్పటి వరకు మా కుటుంబంలో,బంధువుల్లో అమెరికా వెళ్లినవాళ్లు లేరు. కనీసం తెలిసిన వాళ్లు లేరు. ఎట్లయినా సరే అమెరికా వెళ్లాలనే పట్టుదల తప్ప మరో ఆస్తి లేదు. ’ అన్నారు. ఏదోఒకవిధంగా కష్టపడి 1997లో అమెరికా చేరుకున్నారు. అక్కడ మరో ఒంటరి పోరాటం తప్పలేదు. ఎట్టకేలకు ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం లభించింది.‘ రాత్రింబవళ్లు కష్టపడ్డాను.మెళకువలు నేర్చుకున్నాను. నైపుణ్యాన్ని పెంచుకొన్నాను. దశాబ్దానికి పైగా సాధించిన అనుభవం, అక్కడ ఏర్పడిన పరిచయాలు ‘ఇంటర్నేషనల్ సొల్యూషన్స్ గ్రూపు ఏర్పాటుకు అవకాశం కల్పించాయి.’ అని గుర్తు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment