హైదరాబాద్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచి్చంది’ అన్నట్లుంది తెలంగాణలో బైక్ ట్యాక్సీల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో.. దీని ప్రభావం ప్రత్యక్షంగా ఆటోలు, క్యాబ్‌లు, బైక్ ట్యాక్సీలపై పడుతోంది. మహిళలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం చాలా వరకు తగ్గించారు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన వారం రోజుల్లోనే గ్రేటర్‌లో 5 లక్షలకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర బైక్ ట్యాక్సీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి. బైక్ ట్యాక్సీల బుకింగ్‌లు తగ్గిపోవడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బైక్ ట్యాక్సీ కంపెనీలు ధరలను తగ్గించాయి. దీంతో బైక్ క్యాపె్టన్ల ఆదాయం సగానికి పైగా తగ్గిపోయింది.
తగ్గిన ఆదాయం..
ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్లు బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్నాయి. సాధారణంగా ఈ బైక్ ట్యాక్సీలను నిరుద్యోగులు, విద్యార్థులు పార్ట్‌టైం జాబ్‌గా నడుపుతుంటారు. ప్రస్తుతం గ్రేటర్‌లో సుమారు 70 వేల మంది బైక్ ట్యాక్సీ క్యాపె్టన్లు ఉండగా.. వీరిలో మహిళా బైక్ క్యాపె్టన్లు 300 నుంచి 400 మంది ఉంటారు. వీరికి కిలోమీటర్ల చొప్పున ఆయా కంపెనీలు బైక్ క్యాపె్టన్లకు కమీషన్ ఇస్తుంటాయి. అయితే మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ఒక్కో క్యాపె్టన్‌కు రోజుకు 20కి పైగా బుకింగ్‌లు వస్తుండేవి. పెట్రోల్ ఖర్చులు పోను రోజుకు రూ.1,000 పైగానే ఆదాయం సమకూరేది. అయితే ఉచిత బస్సు ప్రయాణం అమలుల్లోకి వచ్చాక బుకింగ్‌లు చాలా వరకు తగ్గిపోయాయని ఓలా బైక్ క్యాపె్టన్ శ్రీను తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు అగ్రిగేటర్ సంస్థలు కూడా బైక్ క్యాప్టెన్ల కమీషన్లను సగానికి పైగా తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ధరలను తగ్గించాయన్నారు. గతంలో 15–25 కిలో మీటర్ల బుకింగ్‌కు కనిష్టంగా రూ.150–180 వరకు ఛార్జీ వచ్చేదని, కానీ ఇప్పుడు రూ.60–80కి మించి రావడం లేదన్నాడు.
మార్గదర్శకాలు రూపొందించాలి..
సాధారణంగా వాహన అగ్రిగేటర్లే ధరలను నిర్ణయిస్తుంటారు. కంపెనీల వద్ద కస్టమర్ల డేటా నిక్షిప్తమై ఉండటంతో ఆల్గరిథం సాంకేతికతతో కస్టమర్ల డేటా, రోజు, డిమాండ్‌ను బట్టి సంస్థలు ధరలను మారుస్తుంటాయని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సల్లావుద్దిన్ తెలిపారు. అందుకే ఆటో, క్యాబ్, బైక్ అగ్రిగేటర్లు ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని, ఇందుకోసం విధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఆటోలు, క్యాబ్‌ల తరహాలోనే బైక్ ట్యాక్సీలను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment