
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో ఘనంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు. జాతీయ పతాకాన్ని గవర్నర్ తమిళిసై ఆవిష్కరించారు. సైనికుల గౌరవ వందనం గవర్నర్ స్వీకరించారు. సికింద్రాబాద్ సైనిక అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆమె నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. వేడుకల్లో సీఎస్ శాంతకుమారి, డీజీపీ అంజనీకుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలకు ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్.. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు అంటూ తెలుగులో గవర్నర్ ప్రసంగం ప్రారంభించారు. సమ్మక్క, సారలమ్మ, కొమురం భీంలను సర్మించుకున్నారు.
‘‘ఎందరో వీరుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది నిజమైన ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి. అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు. అభివృద్ధి అంటే జాతి నిర్మాణం’’ అని తమిళిసై అన్నారు. తెలంగాణలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్రధానికి గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు.