సాక్షి, హైదరాబాద్: వరంగల్ డిక్లరేషన్‌పై గంపెడాశలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళుతున్నారు. శనివారం నుంచి నెల రోజులపాటు ‘పల్లె పల్లెకు కాంగ్రెస్’పేరుతో ఈ డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించేందుకు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూట్‌మ్యాప్‌లు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, ఆయా గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయరంగ వ్యతిరేక విధానాలను వెల్లడించనున్నారు.
అలాగే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాము రైతాంగానికి ఏం చేయబోతున్నామన్న అంశాలను కూడా వివరించనున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఉదయం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి రేవంత్ అక్కంపేటకు బయలుదేరుతారని, మధ్యాహ్నం ఒంటిగంటకు అక్కంపేట చేరుకుని అక్కడి రైతులతో ముచ్చటిస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జయశంకర్‌తో పాటు తెలంగాణకు చెందిన పలువురు ప్రముఖుల గ్రామాల్లో రైతు రచ్చబండలు ఏర్పాటు చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించవచ్చని టీపీసీసీ నాయకత్వం భావిస్తోంది.
మైకులు పెట్టొద్దు... సన్మానాలు చేయొద్దు: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
ఈనెల 27 నుంచి సంగారెడ్డి నియోజకవర్గంలో రైతు డిక్లరేషన్ సభల ఏర్పాట్లు చేసుకుంటున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాను గ్రామాలకు వచ్చే సమయంలో టెంట్‌లు, మైకులు, భోజనాల ఏర్పాట్లు చేయవద్దని, ఊరేగింపులు, శాలువాలు, సన్మానాలు వద్దని నియోజకవర్గ నేతలను కోరుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు.
రోజుకు 4 గ్రామాలు పర్యటిస్తానని, ప్రతి గ్రామంలో 2 గంటలు ఉండి రైతులు, ప్రజలతో మాట్లాడి రాహుల్ గాంధీ సూచనల మేరకు వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరిస్తానని తెలిపారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నేరుగా గ్రామాలకు వెళ్లి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఆయా గ్రామాల ప్రజలు, రైతులతో చెట్టు కింద కూర్చుని మాట్లాడే ప్రయత్నం చేద్దామని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి వెల్లడించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment