మిగులు పనుల పూర్తికి పాలనా అనుమతులు
రెండేళ్లలో 45 వేల ఎకరాలకు నీరు
సమీక్షలో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మిగులు పనుల పూర్తికి ప్రభుత్వం రూ.571 కోట్లతో పాలనాపర అనుమతులు జారీ చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు.
మంథని నియోజకవర్గం పరిధిలోని 63 గ్రామాలను సస్యశ్యామలం చేయడానికి 2007లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకి సంబంధించిన 75 శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చి సత్వరం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శనివారం జలసౌధలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 45 వేల ఎకరాలకు సాగునీరు, 0.5 టీఎంసీలను తాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు.
గోదావరి నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నీళ్లను కన్నెపల్లి వద్ద ఒకటో పంప్‌హౌస్‌కి తరలించి అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు, ఆ తర్వా త రెండో పంప్‌హౌస్‌కి ఎత్తిపోస్తారు. మొత్తం 4.2 టీఎంసీలను రెండో పంప్‌హౌస్‌కు పంప్‌చేస్తారు. కాగా, వరదకు తెగిపోయిన రుద్రారం చెరువు పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
శ్రీరాంసాగర్ నీటితో 28 వేల ఎకరాల ఆయకట్టు
మంథని నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ కింద 28,800 ఎకరాల ఆయకట్టు ఉంది. డీ–83 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా గుండారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుకోవాలి. అక్కడి నుంచి 24 మైనర్ కాల్వల ద్వారా మొత్తం 28,800 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది.
కాలక్రమేణా కాల్వల్లో పూడిక చేరడంతో నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందడం లేదు. గుండారం చెరువు నుంచి చివరి వరకు మరమ్మతులు చేసినీటి సామర్థ్యాన్ని పెంచాలని శ్రీధర్ బాబు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment