నిండుకుండలా నాగార్జునసాగర్ ప్రాజెక్టు.. ఉదయం 8 గంటలకు గేట్లు తెరవనున్న అధికారులు
సాగర్‌లోకి 3.22 లక్షల క్యూసెక్కుల వరద...576.1 అడుగుల వద్ద 271.9 టీఎంసీల నిల్వ
సాక్షి, హైదరాబాద్/నాగార్జునసాగర్/దోమలపెంట: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు నాగార్జునసాగర్‌లోకి 3,22,817 క్యూసెక్కుల నీరు చేరుతుండగా. కుడి, ఎడమ కాలువల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ 37,873 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటినిల్వ 576.1 అడుగుల్లో 271.9 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు.. పూర్తి నీటినిల్వ 312.05 టీఎంసీలు. మరో 41 టీఎంసీలు చేరితే సాగర్ పూర్తిగా నిండిపోతుంది.
ఎగువ నుంచి వస్తున్న వరదతో సోమవారం సాయంత్రానికి సాగర్‌లో నీటినిల్వ గరిష్టస్థాయికి చేరుకుంటుంది. ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రకారం దానికంటే ముందే గేట్లు ఎత్తి వరదను దిగువకు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 8 గంటలకు నాగార్జునసాగర్ గేట్లు పైకి ఎత్తి సుమారు 2లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తామని డ్యాం ఎస్‌ఈ వీపీఎస్.నాగేశ్వర్‌రావు ఆదివారం మధ్యాహ్నం ప్రకటించారు.
సాగర్‌కు దిగువన ఉన్న నల్లగొండ, సూర్యాపేట, గుంటూరు, నర్సారావుపేట జిల్లాల్లోని కృష్ణానది తీర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు హెచ్చరిక జారీ చేశారు. సుంకేశుల, అటు జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొసాగుతోంది.
శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,87,451 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. 882.9 అడుగుల్లో 203.89 టీఎంసీలను నిల్వ చేస్తూ.. పదిగేట్లు 15 అడుగుల మేర ఎత్తి 3,69,250 క్యూసెక్కులు, కుడి కేంద్రంలో 23,146, ఎడమ కేంద్రంలో 35,315 క్యూసెక్కులను వినియోగిస్తూ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి 4,27,711 క్యూసెక్కులు సాగర్ వైపు వెళుతున్నాయి.
రెండో యూనిట్‌కు మరమ్మతులు ఎప్పుడు ?
నాగార్జునసాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో 8 యూనిట్లు ఉన్నాయి. అన్నీ పూర్తిస్థాయిలో నడిస్తే 810 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. ప్రస్తుతం 7 యూనిట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. రెండవ యూనిట్ మరమ్మతులకు గురై ఏడాదిన్నర కావొస్తున్నా చేయించలేదు. ఇప్పుడు వరద భారీగా వస్తున్నా ఆ యూనిట్ నుంచి విద్యుదుత్పత్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై సాగర్ ఎస్‌ఈని వివరణ కోరగా మరమ్మతు చేసేందుకు ఇంజనీర్లు జపాన్ నుంచి రావాల్సి ఉందని.. అందువల్లే ఆలస్యమవుతోందని చెప్పారు.
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, హైదరాబాద్: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరపి ఇవ్వడంతో గోదావరిలో వరద క్రమంతా తగ్గుముఖం పడుతోంది. ఎగువ గోదావరి ప్రధానపాయతోపాటు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు, తాలిపేరు, పెద్దవాగు, కిన్నెరసాని, వాగులు, వంకల్లో ఉధృతి తగ్గింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా, ఎగువ నుంచి 19,645 క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటి నిల్వ 44.49 టీఎంసీలకు చేరింది. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పూర్తిగా తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment