సాక్షి, హైదరాబాద్: ప్రతి రాజకీయ పరిణామంపై వేగంగా స్పందించే కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి మౌనంగా ఎందుకు ఉంటున్నారు? సొంత పార్టీ లో కల్లోలం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కూడా ఆయన ఎందుకు నోరెత్తడం లేదు? నెలరోజులకుపైగా గాంధీభవన్‌కు రాని ఆయన అసలేం చేయాలనుకుంటున్నారు... అనే విషయాలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమ య్యాయి.
జగ్గారెడ్డి సన్నిహితులు మాత్రం ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. నెల రోజులుగా మౌనవ్రతం చేస్తున్న జగ్గారెడ్డి నవంబర్ వరకు ఇదే వైఖరి కొనసాగిస్తారని, అప్పటివరకు పూర్తిస్థాయిలో నియోజకవర్గానికే పరిమితం అవుతారని, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో మార్పు రాకపోతే కొత్త మార్గాన్ని ఎంచుకుంటారని చెబుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ పార్టీకి పోటీగా కొత్తపార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు తెరవెనుక చేయాల్సిన పనులన్నింటినీ ఆయన చక్కబెట్టుకుంటున్నారని సమాచారం.
మార్పు వస్తే ఓకే... లేదంటే ‘కొత్తపార్టీ’?
జగ్గారెడ్డి మౌనం వెనుక కారణమేంటన్న దానిపై ‘సాక్షి’ఆరా తీయగా ఆయన కావాలనే రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదని తెలిసింది. పార్టీ పరిస్థితుల్లో మార్పు కోసం అటు అధిష్టానంతోపాటు ఇటు పార్టీ సీనియర్లతో ఆయన చర్చలు జరుపుతున్నారని, అదే సమయంలో పార్టీ పరిస్థితుల్లో మార్పు రాకపోతే కాంగ్రెస్‌కు పోటీగా మరో పార్టీ పెట్టేందుకు కూడా ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.
ఇందుకోసం ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, అలవికాని పరిస్థితుల్లో ఆయన సొంత పార్టీ ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. తాను ఆశించిన మార్పు పార్టీలో వస్తే కాంగ్రెస్‌లో ఉంటానని, లేదంటే దసరా తర్వాత కీలక నిర్ణయం తీసుకుంటానని అనుచరులతో చెబుతున్నట్లు తెలుస్తోంది.
అప్పటి నుంచీ నిందలే..
బీజేపీ, టీఆర్‌ఎస్‌లలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన జగ్గారెడ్డి తనదైన శైలిలో రాజకీయం నెరుపుతుంటారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి, 2018లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వేదికగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. తన ఆహార్యంతోనే విలక్షణంగా కనిపించే జగ్గారెడ్డి ఏది చేసినా చర్చకు దారితీస్తుందనేది రాజకీయవర్గాల అభిప్రాయం.
అప్పట్లో తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తుంటే జగ్గారెడ్డి మాత్రం ‘జై సమైక్యాంధ్రప్రదేశ్’అని విమర్శల పాలయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు మీడియా సమావేశాల్లో వెల్లడించారు కూడా. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన పలుమార్లు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపై అనేక సందర్భాల్లో విమర్శలు చేసిన ఆయన పార్టీకి నష్టం కలిగిస్తున్నారనేంతవరకు వెళ్లారు. అయినా వెనక్కు తగ్గని జగ్గారెడ్డి తాను పార్టీ మంచి కోసమే చెబుతున్నానంటూ తనదైన శైలిలోనే ముందుకెళ్లారు. ఉన్నట్టుండి ఏమైందో కానీ... ఆయన మౌనం దాల్చారు.
Comments
Please login to add a commentAdd a comment