
సాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం రోజున చేసిన వ్యాఖ్యల దుమారం సద్దుమణిగింది. గాంధీభవన్‌లో శనివారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి సమావేశమై, మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. 'సంస్థాగతంగా పార్టీ పటిష్టతపై చర్చించాము. నిన్నటి సమస్య సద్దు మణిగింది. అన్నదమ్ములం అన్నప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి.
మళ్లీ కలిసిపోతాం. ఏఐసీసీ కార్యదర్శులు కొన్ని సూచనలు చేశారు. నా తప్పును అడిగారు, మరోసారి మాట్లాడనని వివరణ ఇచ్చాను. నిన్నటితో సమస్య అయిపోయింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తా. అంతర్గత విషయాలను బయట మాట్లాడొద్దని ఏఐసీసీ సూచించింది. అలా మాట్లాడటం తప్పని అన్నారు, నేను తప్పు ఒప్పుకున్నాను' అంటూ శుక్రవారం రోజున జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.