సాక్షి, హైదరాబాద్/చౌటుప్పల్/కేతేపల్లి: సంక్రాంతి ప్రయాణాలతో మంగళవారం కూడా రహదారులపై రద్దీ నెలకొంది. నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు తరలి వెళ్లారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, ఏలూరు, తిరుపతి, కడప తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో భారీగా రద్దీ కనిపించింది. మరోవైపు తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులతో జూబ్లీ బస్‌స్టేషన్, ఉప్పల్, ఎల్‌బీ నగర్ తదితర ప్రాంతాలు పోటెత్తాయి. వివిధ మార్గాల్లో బస్సులు కిక్కిరిసి బయలుదేరాయి. ఇక రైళ్లలో జనరల్ బోగీల్లో అప్పటికప్పుడు టికెట్ తీసుకొనే సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు టికెట్‌లను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. గోదావరి, విశాఖ, ఇంటర్‌సిటీ, నర్సాపూర్, మచిలీపట్నం తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో వెయిటింగ్ లిస్టు 350 దాటిపోయింది. చాలా రైళ్లలో ‘నోరూమ్’దర్శనమివ్వడంతో చివరి నిమిషంవరకు ఎదురు చూసిన వాళ్లు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించవల్సి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ చార్జీలపైన 50 శాతం అదనంగా, ప్రైవేట్ ట్రావెల్స్‌ల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేశాయి. కొన్ని సంస్థలు రెండు రెట్లు పెంచాయి. భోగి వేడుకలకు మిగిలింది ఒక్కరోజే కావడంతో చార్జీలు భారమైనా చాలా మంది సొంతూళ్లకు బయలుదేరారు. మరోవైపు సొంత వాహనాల్లో సైతం భారీ ఎత్తున తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేవారు ఎక్కువ శాతం సొంత కార్లు, క్యాబ్‌లను ఆశ్రయించారు. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి సుమారు 15 లక్షల మంది నగర వాసులు సొంతూళ్లకు తరలి వెళ్లినట్లు అంచనా.
జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ..
పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారితో హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్ టోల్‌ప్లాజాల వద్ద మంగళవారం రాత్రి రద్దీ నెలకొంది. పంతంగి వద్ద 16 గేట్లకు గాను విజయవాడ మార్గంలో పది గేట్లు తెరిచారు. సాయంత్రం వరకు టోల్‌ప్లాజా వద్ద సాధారణంగా ఉన్న రద్దీ రాత్రి ఒక్కసారిగా పెరిగింది. సాధారణ రోజుల కంటే పండుగ సమయాల్లో 10 నుంచి 15 వేలకు పైగా వాహనాలు అదనంగా వెళ్తాయని టోల్‌ప్లాజా సిబ్బంది చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment