సాక్షి, భద్రాచలం: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక, భద్రాచలం వద్ద ఉగ్రగోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నది. తగ్గినట్లే తగ్గిన నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 6 గంటలకు 46.20 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం భద్రాచలం వల్ల రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. నదిలో మరోసారి వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరికి వరద పోటెత్తింది.
పేరూరులో ఉదయం 6 గంటలకు నీటిమట్టం 48.44 అడుగులకు పెరిగింది. దీంతో వెంకటాపురం-భద్రాచలం రహదారి బ్రిడ్జిలపై వరద ప్రవహిస్తున్నది. అదేవిధంగా వెంకటాపురం, వాజేడు మండలాల్లో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో అధికారులు రామన్న గూడెం పుష్కర ఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.
ఈ సందర్బంగా కొత్తగూడెం కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా పెరుగుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలి. గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉదృతంగా నీరు వస్తున్నందున ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలు జాప్యం చేయక యంత్రాంగానికి సహకరించి పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు. అలాగే వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే కంట్రోల్ రూమ్‌లకు కాల్ చేయాలి. ఏమైనా ప్రమాదాలు ఏర్పడినప్పుడు వెంటనే అధికారులకు తెలియజేయాలి. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇది కూడా చదవండి: 5 లక్షల ఎకరాల్లో పంటల మునక!
Comments
Please login to add a commentAdd a comment