అహ్మదాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ద.మ.రైల్వే పరిధిలో పలు ప్రాజెక్టులు జాతికి అంకితం
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్– విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించటం సహా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పూర్తయిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. మంగళవారం ఉదయం ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి అహ్మదాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే ప్రాజె క్టులను జాతికి అంకితం చేశారు.
గతేడాది సంక్రాంతి రోజున సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ రైలు కిక్కిరిసి ప్రయాణిస్తుండటంతో దానికి అద నంగా ఇటీవలే రైల్వే బోర్డు రెండు నగరాల మధ్య రెండో వందేభారత్ రైలును మంజూరు చేసింది. సికింద్రాబాద్‌లో ఉద యం ప్రారంభమయ్యే ఈ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కొల్లాం–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను కూడా ప్రా రంభించారు.
కాజీపేట– విజయవాడ, కాజీపేట– బలార్షా మధ్య పూర్తయిన మూడో లైన్ భాగాలను, 14 డబ్లింగ్ లైన్ల ను, కొన్ని బైపాస్, గేజ్ మార్పిడి లైన్లు, పాత రైల్ కోచ్‌లను, స్టేషన్లలో ఏర్పాటుచేసిన రెస్టారెంట్లను, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 193 స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన వన్ స్టేషన్ వన్ ప్రాడక్ట్ కేంద్రాలను, తొమ్మిది పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూడ్సు షెడ్లు, రెండు జన్ ఔషధి కేంద్రాలను ఆయన జాతికి అంకితం చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే నెట్ వర్క్‌లో చోటుచేసుకుంటున్న పురోగతిని ఆయన వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కూడా..
ప్రధాని అహ్మదాబాద్ నుంచి నిర్వహించిన ఈ వర్చువల్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనటం విశేషం. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్, డీఆర్‌ఎం కుమార్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జన ఔషధి షాపులో తక్కువ ధరకు మందులు
సికింద్రాబాద్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన జన ఔషధి, స్థానిక ఉత్పత్తుల కేంద్రాలను కిషన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైల్వే స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లు, తక్కువ ధరకు మందులు అందుబాటులో ఉండేలా జన ఔషధి షాపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రూ.720 కోట్లతో సికింద్రాబాద్, రూ.350 కోట్లతో నాంపల్లి స్టేషన్‌ల పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. చర్లపల్లి టెర్మినల్ పనులు చాలావరకు పూర్తయ్యాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment