
పోలీస్‌స్టేషన్‌లో సంతకం పెట్టి వెళ్తున్న హత్య కుట్ర కేసులో నిందితులు
కుత్బుల్లాపూర్(హైదరాబాద్): మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర కేసులో తమను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారని నిందితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో అరెస్టు అయి జైలులో ఉండి కండిషన్ బెయిల్ మీద విడుదలైన ఏ–1 రాఘవేంద్రరాజు, ఏ–2 అమరేందర్‌రాజు, ఏ–3 రవి, ఏ–4 మధుసూదన్, ఏ–5 యాదయ్య, ఏ–6 నాగరాజు, ఏ–7 విశ్వనాథ్ శుక్రవారం పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేశారు.
మేడ్చల్ కోర్టు ఈ కేసు విచారణను చేపట్టి మొత్తం ఏడుగురు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు వారంలో రెండురోజులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయా ల్సి ఉంది. నిందితులు మీడియాతో మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా అక్రమ కేసు. దీనిని సీబీఐకి అప్పగించాలి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అరాచకాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తాం’అని పేర్కొన్నారు.
‘ఫిబ్రవరి 22న ఎన్నికల కమిషన్ నుంచి నాకు లేఖ వచ్చింది, ఆ రోజు నేను రాష్ట్రపతిభవన్ వద్ద ఉన్నట్లుగా ఆధారాలున్నాయి. నన్ను హత్య చేసే క్రమంలోనే ఈ హైడ్రామా జరిగింది’అని రాఘవేంద్రరాజు ఆరోపించారు. తాను మంత్రి వల్ల దాదాపు రూ.11 కోట్లు నష్టపోయానని, తనపై 13 కేసులు పెట్టించారని, తమ కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. మంత్రిపై తాను వేసిన కేసుల విషయమై రాజీ చేసుకోవడానికే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని అన్నారు.
సస్పెన్స్ తలపించే విధంగా తమ స్టోరీ ఉందని, రాంగోపాల్ వర్మ సినిమా తీస్తే పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు పేర్కొనడం గమనార్హం. 2014 నుంచి మహబూబూనగర్ పట్టణంలో అశాంతి నెలకొందని, ఎవరైనా మంత్రి అరాచకాలను ప్రశ్నిస్తే వారి కుటుంబాలపై దాడి చేయించడం, లేదంటే కేసులు పెట్టించడం, ఆర్థికంగా ఇబ్బందులపాలు చేయడం మామూలైపోయిందని మరో నిందితుడు మున్నూరు రవి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment