బంజారాహిల్స్: నిత్యజీవితంలో తనకు ఎదురైన సమస్యనే అనుభవంగా మార్చుకొని కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. జూబ్లీహిల్స్ భారతీయ విద్యాభవన్ పబ్లిక్ స్కూల్ (విద్యాశ్రమం)లో 8వ తరగతి చదువుతున్న సింగం రవికర్‌రెడ్డి సత్తా చాటాడు. ఇన్‌స్పైర్ (2019– 20) రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. తన అమ్మమ్మ రంగలక్ష్మి అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమై ఇబ్బందులకు గురవుతున్న దయనీయ పరిస్థితిని గమనించాడు రవికర్‌రెడ్డి. అన్నం తింటే బాత్రూంకు వెళ్లాల్సి వస్తోందని.. తనను పట్టుకోవడానికి ఇద్దరు ముగ్గురు అవసరమవుతున్నారని ఆమె బాధపడుతూ భోజనం చేయడమే మానేసింది. ఈ నేపథ్యంలో బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందింది.
ఇవన్నీ ఆ చిన్నారిని ఆలోచనలో పడేశాయి. ఇబ్బందులను తొలగించి రోగులను సులువుగా బాత్రూంకు తీసుకెళ్లే యంత్రాన్ని తయారు చేయాలనుకున్నాడు. నెల రోజుల పాటు శ్రమించి సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ‘ఈజీ లిఫ్ట్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ పేషెంట్స్’ పేరుతో యంత్రాన్ని తయారు చేసి ఇన్‌స్పైర్‌లో ప్రదర్శించాడు. ఈ యంత్రం సహాయంతో రోగులకు సులువుగా సేవలు చేయొచ్చని, వేరొకరి అవసరం లేకుండా కాలకృత్యాలు తీర్చుకునేందుకు సహాయకారిగా ఉపయోగపడుతుందని రవికర్‌రెడ్డి చెప్పాడు. ఈ ఆవిష్కరణలో బీవీబీపీ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణశ్రీ, ఇతర ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment