సిరిసిల్లలో శుక్రవారం ఉదయం కారును ఢీకొట్టిన లారీ
మల్ల వేణి రాజుకి భార్య, పిల్లలు ఉన్నారు. గత బుధవారం సర్దాపూర్ వద్ద కంటైనర్ ఢీకొన డంతో రాజు మరణించగా భార్య సుమలత, ఇద్దరు కొడుకులు మణిదీప్, విక్రమ్ అనాథలయ్యారు. మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు మరణంతో ఆ కుటుంబంలో తీరని వేదన మిగిలింది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రితో పాటు సుమలత, ఇద్దరు పిల్లల పోషణ ప్రశ్నార్థకంగా మారింది. ఆ కుటుంబ రోదనలు అందరినీ కదిలిస్తున్నాయి. రోడ్డునపడ్డ రాజు కుటుంబంలాగానే ఆరు నెలల కాలంలో జిల్లాలో 69 కుటుంబాలు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.’
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని రోడ్లు రక్తసిక్తమవుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం జరుగుతూనే ఉంది. విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లా కేంద్రంగా మారడంతో రహదారులు రద్దీగా మారాయి. అతివేగం, మద్యం మత్తులో వెళ్తుండడంతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆరు నెలల్లో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 69 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల క్రితం అన్నదమ్ములతోపాటు మరో రెండు ఘటనల్లో ఇంకో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇది మరువక ముందే శుక్రవారం ఉదయం సిరిసిల్ల కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఓ ఇసుక లారీ, కారును ఢీకొట్టింది. త్రుటిలో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
112 ప్రమాదాలు.. 69 మంది మృతి
జిల్లాలో ఆరునెలల వ్యవధిలో పోలీసులు రికార్డుల ప్రకారం 112 ప్రమాదాలు జరుగగా.. 69 మంది మరణించారు. 98 మంది గాయపడ్డారు. ఇందులో 22 ప్రమాదాలు ఇసుక ట్రాక్టర్లతో జరగడం విశేషం. గాయపడిన వారిలో 30 శాతం మంది పనులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అనధికారికంగా జిల్లాలో దాదాపు 150 పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు సమాచారం. జిల్లాలో రెండు నెలల వ్యవధిలో ఇసుక ట్రాక్టర్లతోనే 22 ప్రమాదాలు జరిగాయి. తెర్లుమద్ది, రాగట్లపల్లి, పోతుగల్, తంగళ్లపల్లి, వెంకటాపూర్ వద్ద ట్రాక్టర్‌ల ప్రమాదాల్లో 10 మంది వరకు మరణించారు.
రోడ్డున పడుతున్న కుటుంబాలు
జిల్లా వ్యాప్తంగా ఆరు నెలల్లో జరిగిన ప్రమాదాలతో సుమారు 295 మంది కుటుంబసభ్యులు రోడ్డున పడ్డారు. గత నెల 30న జిల్లాలోని సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై నాలుగు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మరణించడంతో ఆ రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు రోడ్డున పడ్డారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలను పట్టించుకోనే వారు లేక దుర్భర జీవితాలు గడుపుతున్నాయి. పిల్లలను చదివించే స్థోమత లేక కూలీలుగా మారుతున్నారు.
ప్రమాదకర మూలమలుపులు ఇవే..
జిల్లాలోని రాగట్లపల్లి, వెంకటాపూర్, పెద్దూరు, సర్దాపూర్, సిరిసిల్ల బైపాస్, చంద్రపేట ఎక్స్‌రోడ్డు, తంగళ్లపల్లి, వేములవాడ కామన్, నాంపలిగుట్ట, జిల్లెల్ల, కంచర్ల, వీర్నపల్లి సబ్‌స్టేషన్, తదితర ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న మూలమలుపుల వద్ద కనీసం ఆర్‌అండ్‌బీ శాఖ వారు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు.
డేంజర్‌గా జంక్షన్లు
ముందుచూపు లేకుండా వేసిన జంక్షన్లు ప్రమాద కేంద్రాలుగా మారాయి. సిరిసిల్ల పట్టణంలోని తంగళ్లపల్లి వెళ్లే బ్రిడ్జి ముందున్న చౌరస్తాతోపాటు అదే దారి గుండా కలిపే రగుడు చౌరస్తా అటు నుంచి సిరిసిల్లకు వచ్చే క్రమంలో చంద్రంపేట జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఆయా ప్రాంతాల్లో అధికారులు హడావుడిగా రక్షణ చర్యలు చేయడం తప్ప శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు. సిరిసిల్ల నూతన కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభమైతే రగుడు చౌరస్తాలో వాహనాల రద్దీ మరింత పెరిగి ప్రమాదాలు సైతం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నా యి. శాశ్వత ప్రమాదరక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
లారీల భయం
జిల్లాలో మానేరు పరివాహక ప్రాంతాల వాసులు అ వసరాల కోసం ఇసుకను తీయడం పరిపాటిగా మా రింది. అంతేకాకుండా కాసులు కురిపించే వనరుగా ఇసుక మారడంతో ఇసుకాసురులు దొడ్డిదారిన లారీ ల్లో అర్ధరాత్రి అతివేగంగా దూరప్రాంతాలకు తరలి స్తున్నారు. ఇలాంటి చర్యలతో పలుమార్లు రోడ్డు ప్ర మాదాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన ఇసుక లారీ ప్రమాదాల ఘటనను దృష్టిలో పెట్టుకొని అధి కారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
తనిఖీలు ముమ్మరం
వాహనదారులు విధిగా హెల్మె ట్, సీటుబెల్టు ధరించాలి. బేఖా తరు చేసిన వారికి జరిమానాలు వేశాం. నిబంధనలు పాటించా లి. భారీ వాహనాల వేగం నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్ని ఠాణాల అధికారులకు ఆదేశాలిచ్చాం. లాక్‌డౌన్ సమయంలో తప్ప ప్రతీ రోజు డ్రంకెన్‌డ్రైవ్ చేపడుతున్నాం. నిర్ణీత స్పీడ్, వాహనచట్టాన్ని పాటిస్తే ప్రాణాలు పోకుండా కాపాడుకోవచ్చు.
– రాహుల్‌హెగ్డే, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment