సాక్షి, హైదరాబాద్/ షాద్‌నగర్/ శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచా రం కేసులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ హైదరాబాద్‌కు వచ్చింది. కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్ట్ మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్, సభ్యులు బాంబే హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ రేఖా బాల్దోటా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాజీ చీఫ్ బి.కార్తికేయన్‌లు ఆదివారం చటాన్‌పల్లిలోని దిశ ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
త్రిసభ్య కమిటీతో పాటు ‘దిశ’హత్యాచారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) చైర్మన్, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్, విచారణాధికారి (ఐఓ) జె.సురేందర్‌రెడ్డి, శంషాబా ద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, కమిషన్ తరుఫు న్యాయవాదు లు, కమిషన్ సెక్రటరీ కూడా ‘దిశ’సంఘటనా స్థలికి సంబంధించిన ప్రైవేట్ గెస్ట్‌హౌస్, తొండుపల్లి గేటు, చటాన్‌పల్లి ప్రాంతాలను సుమారు 6 గంటలపాటు సందర్శించారు.
తొలుత నలుగురు నిందితులను దర్యాప్తు నిమిత్తం ఉంచిన ప్రైవేట్ గెస్ట్ హౌస్‌ను బృందం సందర్శించింది. ఆ తర్వాత ‘దిశ’ఘటనకు కారణమైన తొండుపల్లి గేటును పరిశీలించింది. దిశ స్కూటర్‌ను ఎక్కడ పార్క్ చేసింది? నిందితులు లారీని ఎక్కడ నిలిపి ఉంచారు? వంటి వివరాలపై డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది. జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రహరీలోకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
సుమారు 20 నిమిషాల పాటు బృందం అక్కడే గడిపింది. కాగా, తొండుపల్లి గేటు సమీపంలో దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి త్రిసభ్య కమిటీని కలిశారు. తమకు కూడా ఒకరోజు సమయమివ్వాలని శ్రీధర్‌రెడ్డి కోరగా.. ‘మీ సమస్యలన్నీ మాకు తెలుసని.. మీకు న్యాయం జరుగుతుంది’అని కమిషన్ హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
నిందితుల తరఫున విచారణ వద్దు...
సిర్పుర్కర్ కమిషన్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ సంద ర్శించి, రికార్డులను క్షుణ్నంగా పరిశీలించింది. ‘దిశ’కేసు సమయం లో స్టేషన్‌లో రికార్డ్‌ల నిర్వహణ, విలేకరుల సమావేశం నిర్వహించిన సమావేశం గది, స్టేషన్‌లోని ఇతరత్రా ప్రాంతాలను పర్యవేక్షించింది.
ఇదిలా ఉండగా.. దిశను అత్యంత దారుణంగా హతమార్చిన వ్యవహారంలో సిర్పుర్కర్ కమిటీ ప్రజలకు ఏ విధమైన సంకేతాలు ఇస్తుందని, నిందితుల తరుఫున విచారణ చేయడమేంటని ప్రశ్నిస్తూ షాద్‌నగర్ పీఎస్ ఎదుట ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ‘కమిషన్ గో బ్యాక్’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నేతలు స్టేషన్ ముందు బైఠాయించారు.
చటాన్‌పల్లిలో ప్రతీ అంశం పరిశీలన..
షాద్‌నగర్ పీఎస్ నుంచి కమిటీ నేరుగా చటాన్‌పల్లికి చేరుకుంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సుమారు గంటసేపు క్షుణ్నంగా పరిశీలించింది. సీన్ రీ–కన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను తీసుకొచ్చిన బస్ ఎక్కడ నిలిపారు? దిశ వస్తువులను ఎక్కడ పాతి పె ట్టారు? నిందితులు ఎటువైపు పారిపోయే ప్రయత్నం చేశారు? ఆ సమయంలో పోలీసులు నిల్చున్న చోటు, ఎదురు కాల్పుల్లో నిందితుల మృతదేహాలు పడి ఉన్న దూరం.. వంటి ప్రతీ అంశంలోనూ కమిషన్ క్షుణ్నంగా వివరాలు సేకరించింది.
‘దిశ’ను దహనం చేసిన ప్రాంతాన్ని సాధ్యమైనంత దగ్గరికి వెళ్లి పరిశీలించింది. కాగా, ‘దిశ’నిందితుల ఎన్‌కౌంటర్ జరిగి డిసెంబర్ 6తో రెండేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 2లోపు సుప్రీంకోర్ట్‌కు కమిషన్ నివేదికను సమర్పించే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment