Hyderabad: బాబా అవతారమెత్తి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సమస్యలు తీరుస్తానంటూ.. | Software Woman Cheated By Fake Baba At Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad: బాబా అవతారమెత్తి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సమస్యలు తీరుస్తానంటూ..

Published Thu, Oct 20 2022 5:37 PM | Last Updated on Thu, Oct 20 2022 5:55 PM

Software Woman Cheated By Fake Baba At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరాదిలో ఉన్న ఘజియాబాద్‌ సమీపంలోని షహద్ర ప్రాంతం నకిలీ బాబాలకు అడ్డాగా మారింది. లోకల్, యూట్యూబ్‌ ఛానళ్లతో పాటు ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తున్న ఈ బురిడీ బాబాలు అందినకాడికి కాజేస్తున్నారు. ఇలాంటి ఓ బాబా వల్లో పడిన నగర యువతి ఏకంగా రూ.47 లక్షలు కోల్పోయింది. బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి బాబా చేతిలో పడి గతేడాది పాతబస్తీకి చెందిన యువతి రూ.లక్ష, మరో మహిళ రూ.4 లక్షలు ‘సమర్పించుకుని’ పోలీసు వద్దకు వచ్చారు.

నగరానికి చెందిన ఓ యువతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తోంది. జాతకాలు, పూజలపై నమ్మకం ఉన్న ఈమె కొన్ని వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో వాటి పరిష్కారం కోసం ప్రత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ (ఇన్‌స్టాగ్రామ్‌)లో వచ్చిన ఓ యాడ్‌ ఆమె దృష్టికి ఆకర్షించింది. అందులోని ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించారు. తన విషయాన్ని బురిడీ బాబాకు చెప్పగా సమస్యలు పరిష్కరిస్తానంటూ నమ్మబలికాడు. తన పేరు గోపాల్‌ శర్మగా చెప్పుకున్న అతను తొలుత ఆమె వివరాలు తెలుసుకున్న బురిడీ బాబా ఏదో పరిశీలనలు చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చాడు.
చదవండి: 3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. పెట్రోల్‌ పోసుకొని వివాహిత ఆత్మహత్య

చివరకు జాతకంలో కొన్ని దోషాలు ఉన్నాయని, నివారణ పూజలు చేసి సరిదిద్దుతానని నమ్మబలికాడు. పూజ ప్రారంభించడానికి, ఇతర ఖర్చులకు రూ.32 వేలు చెల్లించాలని కోరాడు. ఇలా మొదలెట్టిన అతగాడు దఫదఫాలుగా రకరకాల పేర్లు చెప్పి డబ్బు దండుకున్నాడు. పూజ మొదలెట్టానని, సామాగ్రి ఖరీదు చేయడానికని, ఆపై మరికొన్ని సామాన్లు కొనాలంటూ కారణాలు చెప్పాడు. ఆపై ఆమెను సంప్రదించిన బాబా పూజ మధ్యలో ఆగిందంటూ చెప్పాడు. అలా ఆగిపోతే విషాదం జరుగుతుందని, ఆనారోగ్యం పాలవుతావని భయపెట్టాడు.

ఇలా రకరకాల పేర్లు చెప్పి ఆమె నుంచి రూ.47 లక్షలు వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని ఆమె యూపీఐతో పాటు రెండు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసింది. ఓ సందర్భంలో పూజ పూర్తి చేయడానికంటూ కొంత మొత్తం డిమాండ్‌ చేశాడు. మరుసటి రోజు ఉదయానికి ఆ డబ్బు పంపాలన్నాడు. ఆమె నగదును ఆ రోజ సాయంత్రానికి బదిలీ చేయగా... టైమ్‌ దాటాక పంపడంతో పూజ తంతు కాలేదని, మళ్ళీ అంతే మొత్తం పంపాలన్నాడు. చివరకు తాను మోసపోయానని తెలుసుకుంది. దీంతో బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు బాధితురాలు నగదు బదిలీ చేసిన యూపీఐ ఖాతా నెంబర్‌తో పాటు బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా ముందుకు వెళ్తున్నారు.

షహద్ర ప్రాంతానికి చెందిన బురిడీ బాబాలను పట్టుకోవడం పెద్ద సవాల్‌గా మారుతోందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి సహాయం కోరితే విషయం నిందితుడికి చేరుతుంది. అలా కాకుండా నేరుగా దాడి చేస్తే గ్రామం మొత్తం దాడులకు పాల్పడతారని చెప్తున్నారు. ఈ బురిడీ బాబాలు చేసిన వాటిలో వెలుగులోకి రాని మోసాలు అనేకం ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో వాళ్ళు బయటకు రాలేదని భావిస్తున్నారు. తాజాగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ముంచిన బురిడీ బాబాను పట్టుకోవడానికి మరో టీమ్‌ను ఉత్తరాదికి పంపాలని నిర్ణయించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement