
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కన్న కొడుకు జీవితాంతం సుఖంగా ఉండాలని భావించిన ఆ తల్లి తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. తన ఉద్యోగాన్ని కుమారుడికి పెట్టించింది. కానీ ఆ ప్రభుద్ధుడు ఆస్తి మొత్తం అమ్మి, తల్లిని కొట్టాడు. పోలీసుల కథనం ప్రకారం.. తంగళ్లపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన శమీమ్ సుల్తానా భర్త అబ్దుల్ మజీద్ ఎస్‌టీవోలో పనిచేసేవారు.
విధి నిర్వహణలో ఉండగానే ఆయన చనిపోవడంతో ఆ ఉద్యోగం శమీమ్ సుల్తానాకు ఇచ్చారు. 21 ఏళ్లు పని చేసిన ఆమెకు ఆరోగ్యం సహకరించకపోవడంతో 2014లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని, ఉద్యోగాన్ని కుమారుడు అబ్దుల్ బియాబాని ఉరఫ్ రవూఫ్‌కు పెట్టించింది. కానీ ఆ తర్వాత తన బాగోగులు చూస్తాడనుకున్న కొడుకే కాలయముడిలా మారాడు. ఆమె పేరిట ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నాడు. తల్లికి ఒక్క పైసా ఇవ్వలేదు. ఈ క్రమంలో శమీమ్ సుల్తానా ఉంటున్న ఇంట్లోకి చొరబడి, వస్తువులను చిందరవందర చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. రవూఫ్ చంపుతాడని భయపడిన ఆమె తంగళ్లపల్లి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment