
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో మహిళా ప్రయాణికులకు మరింత భద్రతను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు ఇక నుంచి ఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు తోడుగా ఉంటారు. ప్రయాణికులతో పాటే రైళ్లలో ప్రయాణం చేస్తారు. సహాయం కోరితే వెంటనే వచ్చి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని ప్రస్తుతం 8 రైళ్లలో ప్రారంభించారు. దశల వారీగా మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు. రైళ్లలో దొంగలు, అసాంఘిక శక్తులు, పోకిరీల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఒంటరి మహిళా ప్రయాణికులు సెక్యూరిటీ సహాయ నంబర్ 182కు ఫోన్ చేస్తే చాలు.. పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు. మహిళా ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సదుపాయం కల్పించేందుకు ‘మేరీ సహేలీ’తోడుగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
ట్రైన్ ఎక్కినప్పట్నుంచి దిగే వరకు..
ఈ ‘మేరీ సహేలీ’లో భాగంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో రైళ్లు బయలుదేరే సమయంలోనే ఆర్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌లు, మహిళా రైల్వే భద్రతా దళం సిబ్బంది మహిళా ప్రయాణికులతో మాట్లాడుతారు. వారి భద్రతకు భరోసా ఇస్తారు. ప్రయాణ సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో 182 నంబరుకు ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తారు. అలాగే ఆర్‌పీఎఫ్ మహిళా పోలీసులు మహిళలు ప్రయాణించే సీట్ల నంబర్లను, వివరాలను సేకరించి అవసరమైన భద్రతా చర్యలను చేపడతారు. మార్గమధ్యలో రైళ్లు ఆగే స్టేషన్లలో విధులు నిర్వహించే ఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా సదరు మహిళలు ప్రయాణం చేసే బోగీలపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. అవసరమైతే వారితో మాట్లాడుతారు. ఎలాంటి సహాయం కావాలో తెలుసుకుంటారు.
ప్రయాణ సమయంలో ట్రైన్‌లో విధి నిర్వహణలో ఉండే ఆర్‌పీఎఫ్ సిబ్బందితో పాటు, స్టేషన్ సిబ్బంది కూడా మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. మహిళా ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆర్‌పీఎఫ్ సిబ్బంది వారితో మరోసారి మాట్లాడుతారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే వివరాలను సేకరిస్తారు. కాగా సుమారు 500 మంది మహిళా కానిస్టేబుళ్ల సేవలను ‘ఆపరేషన్ మేరీ సహేలీ’ కోసం వినియోగించుకుంటారు. ప్రతి ట్రైన్‌లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళా ఆర్‌పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ నిరంతరం నిఘా కొనసాగిస్తారు.
ఆ 8 రైళ్లు ఏవంటే..
సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రాకపోకలు సాగించే గోల్కొండ (07202) ఎక్స్‌ప్రెస్
నాంపల్లి నుంచి విశాఖపట్నం వరకు నడిచే గోదావరి (02778) ఎక్స్‌ప్రెస్
తిరుపతి-రాయలసీమ (02793) రాయలసీమ ఎక్స్‌ప్రెస్
నాందేడ్-అమృత్‌సర్ సచ్‌ఖండ్ (02715) ఎక్స్‌ప్రెస్
కిన్వత్-ముంబై, నందిగ్రామ్ (01142) ఎక్స్‌ప్రెస్
గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ (07201) ఎక్స్‌ప్రెస్
విజయవాడ-హుబ్బళి (హుబ్లీ) అమరావతి (07225) ఎక్స్‌ప్రెస్
కాచిగూడ-మైసూరు మధ్య నడిచే మైసూర్ (02785) ఎక్స్‌ప్రెస్
నిరంతరం అప్రమత్తంగా ఉండాలి..
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరీ సహేలీ కార్యక్రమంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆర్‌పీఎఫ్ సేవలను ప్రశంసించారు. మహిళా ప్రయాణికుల భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పారు. మహిళలు ఫోన్ చేస్తే వెంటనే చేరుకోని తగిన భద్రత కల్పించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment