వరంగల్ అర్బన్ జిల్లా ఒంటిమామిడిపల్లె ప్రభుత్వ పాఠశాల గేటు ఎదుట ‘నో అడ్మిషన్ బోర్డు
సాక్షి ప్రతినిధి, వరంగల్: కరోనా ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీసింది. ప్రజల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసింది. ఈ పరిస్థితుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు పిల్లల చదువులు భారంగా మారిపోయాయి. ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరగతులు సరిగా జరగకున్నా ప్రైవేటు యాజమాన్యాలు ఫీజులు ముక్కు పిండి మరీ వసూలు చేస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి. ప్రైవేటులో ఫీజులు కట్టలేక,, చాలా వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ఉండటం, అర్హులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన బోధన కూడా కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు సర్కారీ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికి తోడు 8వ తరగతిలోపు విద్యార్థులు టీసీ లేకుండానే ఎక్కడైనా అడ్మిషన్ పొందే వెసులుబాటు ఉండటంతో మరో ఆలోచన లేకుండా పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. కొన్ని స్కూళ్లు ‘నో అడ్మిషన్స్’బోర్డులు కూడా పెడుతుండటం ప్రభుత్వ స్కూళ్లకు పెరుగుతున్న ఆదరణను స్పష్టం చేస్తోంది.
2020–21 వరకు తక్కువ చేరికలే..
2016–17లో రాష్ట్రంలోని పాఠశాలల్లో 58.67 లక్షల మంది విద్యార్థులు ఉంటే అందులో ప్రభుత్వ స్కూళ్లలో 48.29 శాతం మంది, ప్రైవేటు పాఠశాలల్లో 51.71 శాతం మంది ఉన్నారు. అలాగే 2017–18, 2018–19లో కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు, చేరికల శాతం రెండూ ప్రైవేటు స్కూళ్ల కంటే తక్కువగానే ఉన్నాయి. 2016 విద్యా సంవత్సరంతో పోలిస్తే 2019–20లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2.15 శాతం మేర తగ్గిపోయింది. 2020–21లో కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే కరోనా విసిరిన పంజాతో ఉద్యోగాలు కోల్పోయి, ఆదాయాలు పడిపోయిన పేద, మధ్యతరగతి వారంతా ఈసారి ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. ముఖ్యంగా పట్టణాల్లో, మండల కేంద్రాల్లోని సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతున్నాయి.
జిల్లాల వారీగా చూస్తే..
♦వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రభుత్వ పరిధిలోని 562 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో జోరుగా కొత్త అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో సీట్లు దాదాపు నిండడంతో ఇతర గ్రామాల వారికి ‘నో అడ్మిషన్స్’’బోర్డు పెట్టారు.
♦నల్లగొండ జిల్లాలో 2,120 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. పది రోజుల్లో కొత్తగా 3,455 మంది విద్యార్థులు ఈ పాఠశాలల్లో చేరారు. అత్యధికంగా 6వ తరగతిలో 1,793 మంది చేరగా, 1వ తరగతిలో 1,154 మంది చేరారు. నల్లగొండ పట్టణం, మండలంలోని పాఠశాలల్లో అత్యధికంగా 557 మంది విద్యార్థులు చేరారు.
♦ఖమ్మం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 2,361 మంది విద్యార్థులు చేరారు. అత్యధికంగా నేలకొండపల్లి మండలం రాయగూడెం పాఠశాలలోని 1వ తరగతిలో 160 మంది చేరారు.
♦భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని తరగతులు కలిపి కొత్తగా 2,996 అడ్మిషన్లు అయ్యాయి. అత్యధికంగా 3వ తరగతిలో పిల్లలు చేరారు. గౌతమ్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ స్కూల్ తొమ్మిదవ తరగతిలో 190 మంది విద్యార్థులు, ఆనందఖని ఉన్నత పాఠశాలలో 734 మంది ఉన్నారు.
♦నిజామాబాద్ జిల్లాలో 3,245 అడ్మిషన్లు జరిగాయి. బోర్గాం(పి) హైస్కూల్‌లో 6వ తరగతిలో 89 మంది ప్రవేశాలు పొందారు. కరీంనగర్ జిల్లాలో 6,7,8 తరగతుల్లో 3,061 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఎక్కువమంది పిల్లలు 6వ తరగతిలో చేరారు.
♦రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 700 మంది విద్యార్థులు చేరారు. మంచిర్యాల జిల్లాలో మొత్తం స్కూళ్లు 753 ఉండగా 1వ తరగతిలో 143 మంది 2 నుంచి 10వ తరగతి వరకు 254 మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు.
♦సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతిలో చేరేందుకు 360 దరఖాస్తులు వచ్చాయి. కేవలం 60 సీట్లు మాత్రమే ఉండడంతో మిగతావారికి అడ్మిషన్లు నిరాకరించారు.
కరోనాతో ఆర్థిక పరిస్థితి తారుమారైంది
నాకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది వరకు సూర్యాపేట జిల్లా కోదాడలోని ప్రైవేట్ పాఠశాలల్లో చదివించాను. కరోనా నేప«థ్యంలో పెట్టుబడి డబ్బులు అందక, వ్యవసాయం సరిగా సాగక ఆర్థిక పరిస్థితి తారుమారైంది. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు భారంగా మారాయి. దీంతో ముగుర్నీ బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో 2, 3, 4 తరగతుల్లో చేర్పించా. ఇక్కడ ఇంగ్లిష్ మీడియం కూడా ఉంది. ఉపాధ్యాయుల బోధన కూడా బాగుందని చాలామంది చెప్పారు.
గణనీయంగా పెరుగుతున్న అడ్మిషన్లు
ప్రభుత్వ పాఠశాలల్లో ఈసారి అడ్మిషన్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధం గా ఇప్పటివరకు జిల్లాలో ఒకటో తరగతిలో 861 అడ్మిషన్లు వచ్చాయి. రెండో తరగతి నుంచి పదవ తరగతి వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు నాలుగు వేల పైచిలుకు నూతన అడ్మిషన్లు జరగొచ్చని అంచనా వేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment