కాశీబుగ్గ: వరంగల్ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యకళాశాలలో 2022–23 విద్యా సంవత్సరానికి రద్దయిన ప్రవేశాలను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ, ఆయుర్వేద వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ...2011 నుంచి కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు భర్తీ చేయడం లేదన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మొత్తం 67 పోస్టులకు 44 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మండిపడ్డారు. కళాశాలలో కనీస సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని గమనించాకే భారతీయ వైద్య వ్యవస్థ జాతీయ కమిషన్ (ఎన్సీఐఎస్ఎం) అడ్మిషన్లు రద్దు చేసిందని తెలిపారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్‌గౌడ్‌కు వినతిపత్రం అందజేశారు. నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ వరంగల్ నిర్వాహక కార్యదర్శి హర్షవర్ధన్, హనుమకొండ జిల్లా కన్వీనర్ నిఖిల్, సుజిత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment