ఘుమఘుమలాడే సువాసనలు వెదజల్లుతూ.. నోట్లో వేసుకుంటే కరిగిపోయే.. హలీం, హరీస్.. రుచి అత్యంత మధురం.. వీటి పుట్టుపూర్వోత్తరాల్లోకెళితే.. హలీం, హరీస్‌ను తొలుత అరబ్ దేశాలలో మాత్రమే తయారు చేసేవారు. క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. మొఘల్ పాలకుల కాలంలో ఢిల్లీకి, నిజాం నవాబుల పరిపాలనలో హైదరాబాద్‌కు చేరిన హలీం, హరీస్ రుచులను తెలుగు సంస్కృతి మరింతగా ఆదరించింది. ఆ తరువాత అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. బిర్యానీ ఎప్పుడూ ఉండేదే.. హలీం, హరీస్ మాత్రం రంజాన్ స్పెషల్. ఇల్లెందురూరల్: తెల్లవారుజామున సహరితో రోజా (ఉపవాస దీక్ష) ప్రారంభించి మనసంతా అల్హాహ్‌కి ఇచ్చేసినా, సాయంత్రం ఇఫ్తార్ వేళ ఏవరైనా హలీం, హరీస్‌లను రుచి చూడాల్సిందే. ప్రతిరోజూ పానీపూరీలు, పుల్కాలకు అలవాటు పడిన ప్రజలు రంజాన్ మాసంలో మాత్రం హలీం, హరీస్‌లే. ఇంతటి రుచికరమైన వంటకాలను ఆరగించేందుకు ముస్లింలతోపాటు అన్నివర్గాల ప్రజలు రంజాన్ మాసం కోసం ఎదురు చూస్తుంటారు.
ఎలా తయారు చేస్తారంటే..
హలీం, హరీస్‌ల రుచి వంట మాస్టర్ తయారీ విధానంపైనే ఆధారపడి ఉంటుంది. వీటి తయారీ ప్రత్యేకంగా ఉంటుంది. దీన్ని రుచిగా తయారు చేయడానికి వంట మాస్టర్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. వీటిని తయారు చేసేందుకు ముందుగా ప్రత్యేకమైన మట్టి బట్టీ సిద్ధం చేస్తారు. దీనిలో పెద్ద పాత్ర ఉంచి కట్టెలతో మంట చేస్తారు. నానబెట్టిన గోధమ రవ్వ లేదా గోధుమలు వేసి హలీంకు అయితే మటన్, హరీస్‌కు అయితే చికెన్. ముక్కలు దానిలో వేసి నెయ్యి, నీరు పోసి ఉడికించడం ప్రారంభిస్తారు. ప్రతిరోజూ తెల్లవారు జామున ప్రారంభమైన ఈ వంటకం మధ్యాహ్నం 3 గంటలయితే కానీ పూర్తికాదు. అంతకు ముందే వేరుగా సిద్ధం చేసిన మసాలా దినుసులు, సుగంధ ద్రవ్యాలు వేసి ప్రత్యేకమైన కట్టె గంటెతో కలియబెట్టడం చేస్తారు. ఇలా 3, 4 గంటలు దంచడం, తిప్పడం చేస్తేనే పాత్రలో వేసిన ఆహార పదార్థాలన్నీ పేస్ట్‌లా తయారవుతాయి. దాన్ని ప్లేట్లలోకి తీసుకొని లెమన్, వేయించిన పల్చటి ఉల్లిగడ్డ ముక్కలతో కలిపి వడ్డిస్తారు. శేరువా కూడా ఇస్తారు. అలా.. పొగలు కక్కుతున్న హలీం, హరీస్‌లను నోట్లో వేసుకుంటే స్వర్గంలో ఉన్నట్టుంది అంటుంటారు వాటి రుచి చూసినవారు. అందుకే రంజాన్ మాసంలో మాత్రమే లభించే హలీం, హరీస్ రుచి చూసేందుకు ప్రజలు ఎదురు చూస్తుంటారు.
పలు కూడళ్లలో విక్రయ కేంద్రాలు..
ఇంతకు ముందు చాలామంది హైదరాబాద్ వెళ్లి హలీం, హరీస్ రుచి చూసి ఇంటికి వచ్చాక నెలంతా మర్చిపోలేకపోయేవారు. మన ప్రాంతంలో కూడా లభిస్తే బాగుండని అల్లాను కోరుకునేవారు. అలాంటి వారి ఆశల ఫలితమేమో.. దశాబ్ధకాలంగా జిల్లా వ్యాప్తంగా ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు వంటి పట్టణ కేంద్రాలలో హలీం, హరీస్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఫుడ్ రెస్టారెంట్లు, హోట ళ్లు కూడా ప్రత్యేకంగా హలీం, హరీస్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు సాయంత్రం రంజాన్ స్పెషల్ వంటకాలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి.
చాలా రుచిగా ఉంటుంది
హలీం, హరీస్ పోషక విలువలతో కూడిన రుచికరమైన ఆహారం. రంజాన్ మాసంలో వీటిని ఇష్టపడని వారుండరు. గతంలో హైదరాబాద్ వంటిì నగరాలకు వెళ్లినప్పుడే మాత్రమే రుచిచేసే వాళ్లం. ఇప్పుడు అన్నిచోట్లా విక్రయించడం ఆనందంగా ఉంది.
– సయ్యద్ అబ్ధుల్ భారీ, వెల్టింగ్ షాపు నిర్వాహకుడు, ఇల్లెందు
అందుబాటు ధరల్లోనే..
హలీం తయారీ వెనుక ఎంత కష్టమున్నా అందరికీ అందుబాటులో ఉండే ధరల్లోనే విక్రయిస్తున్నాం. రంజాన్ మాసంలో హలీం రుచిని అందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా స్టాల్‌ను ఏర్పాటు చేశాం. ఉపాధి కూడా ఉంటుంది. విక్రయాలు బావున్నాయి.
– అమానుల్లాఖాన్, హలీం సెంటర్ నిర్వాహకుడు, ఇల్లెందు
Comments
Please login to add a commentAdd a comment