ఏపీలోనూ హలీమ్ హవా
రమజాన్ మాసంలో ఆంధ్రప్రదేశ్‌లో
అమ్మకాలు రూ. 125 కోట్లు పైమాటే
విజయవాడ బ్యూరో: రమజాన్ మాసం శనివారంతో ముగిసింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ సైతం హలీమ్‌కు సలామ్ చేసిందనే సంగతి అమ్మకాలు చూస్తే తెలుస్తోంది. రమజాన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా హలీమ్‌తోపాటు ఫాలుదా, బిర్యాని, కబాబ్, రోటీ, చికెన్, మటన్ ఐటెమ్స్ అమ్మకాలు రూ. 125 కోట్ల పైమాటే అంటే ఆశ్చర్యం కలగకమానదు. విజయవాడ, గుంటూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హలీమ్ సెంటర్లు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగించారు.
గత ఏడాది విజయవాడలో 5 హలీమ్ సెంటర్లు ఉంటే ఈసారి ఏకంగా 40కి పైగా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రోజుకు రూ.5 నుంచి 6 కోట్ల అమ్మకాలు జరిగాయి. రంజాన్ మాసంలో మొత్తం మీద రూ. 125 నుంచి 150 కోట్లు విక్రయాలు జరిగినట్టు సమాచారం. హైదరాబాద్‌లో పేరెన్నికగన్న పిస్తాహౌస్‌ను విజయవాడలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి భీమవరం, తెనాలికి విక్రయాలు విస్తరించడం విశేషం.