సాక్షి, హైదరాబాద్: పేదలకు పెద్ద దిక్కుగా నిలిచిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఎలక్టివ్ సర్జరీలే కాదు.. అత్యవసర చికిత్సలూ నిలిచిపోయాయి. పాతభవనంలోని ఆపరేషన్ థియేటర్లకు తాళం వేయడంతో జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాల్లోని సర్జరీలన్నీ నిలిచిపోవడంతో ఇప్పటికే ఆస్పత్రిలో అడ్మిటై...చికిత్సల కోసం ఎదురు చూస్తున్న నిరు పేదలకు తీరని నిరాశే మిగులుతోంది. కులీకుతుబ్‌షా, ఓపీ భవనాల్లో పలు ఆపరేషన్ థియేటర్లు ఉన్నప్పటికీ..ఆయా భవనాల్లో పోస్టు ఆపరేటివ్ వార్డులు లేకపోవడం, ఉన్నవాటికి ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో చికిత్సలు వాయిదా వేయాల్సి వస్తుంది. సర్జరీలన్నీ నిలిచిపోవడంతో ఆస్పత్రిలో వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓటీ, పోస్ట్ ఆపరేటివ్ ప్రాక్టీస్ లేకపోవడం, వార్షిక పరీక్షల గడువు సమీపిస్తుండటంతో ఆయా వైద్య విద్యార్థులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో..
వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో 11 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. వీటిలో నాలుగు థియేటర్లు పాతభవనంలోనే ఉన్నాయి. ప్రస్తుతం పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడం, ఆ ప్రాంగణంలోని వరద నీరు వచ్చి చేరడంతో ఇటీవల పాత భవనాన్ని ఖాళీ చేసి, తాళం వేసిన విషయం తెలిసిందే. పాత భవనంలో జనరల్ మెడిసిన్, జనరల్, ఆర్థోపెడిక్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీలకు చెందిన సుమారు 700 మంది రోగులు చికిత్స పొందేవారు. ఎనిమిది యూనిట్లు ఉన్న జనరల్ సర్జరీ విభాగానికి రెండు ఆపరేషన్ థియేటర్లు ఉండగా, ఆరు యూనిట్లు ఉన్న ఆర్థోపెడిక్ విభాగానికి ఒక ఆపరేషన్ థియేటర్ ఉంది. జనరల్ సర్జరీ విభాగానికి చెందిన ఆపరేషన్ థియేటర్‌నే సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం వైద్యులు కూడా ఉపయోగించుకునే వారు.
రెండు నెలల నుంచి ఈ మూడు ఆపరేషన్ థియేటర్లు మూతపడే ఉన్నాయి. అప్పటి నుంచి ఆయా విభాగాల్లో ఎలక్టివ్ సర్జరీలతో పాటు కిడ్నీ, కాలేయ మార్పిడి వంటి అత్యవసర చికిత్సలు కూడా నిలిచిపోయాయి. కోవిడ్ భయంతో ఇప్పటికే ఎలక్టివ్ సర్జరీలను వాయిదా వేస్తుండగా...ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో అత్యవసర చికిత్సలు వాయిదా వేయాల్సి వస్తుంది. గతంలో ఇక్కడ చిన్నాపెద్ద అన్ని కలిపి రోజుకు సగటున 140 నుంచి 150 ఎలక్టివ్ సర్జరీలు జరిగేవి. ప్రస్తుతం పాత భవనంలోని ఓటీలన్నీ మూతపడటంతో ప్రస్తుతం వారానికి నాలుగైదు సర్జరీలే జరుగుతుండటం విశేషం. టెక్నీషియన్ లేక పోవడంతో కార్డియో థొరాసిక్ విభాగంలో గత రెండేళ్ల నుంచి ఓపెన్ హార్ట్ సర్జరీలు నిలిచిపోగా...అనుభవం ఉన్న వైద్యులు లేక పోవడంతో యూరాలజీ విభాగంలో గత ఆరు నెలల నుంచి కిడ్నీ మార్పిడి చికిత్సలు నిలిచిపోవడం విశేషం.
గాంధీ, కింగ్‌కోఠిలను కోవిడ్ సెంటర్లుగా మార్చడంతో..
గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులను ఇప్పటికే పూర్తిస్థాయి కోవిడ్ కేంద్రాలుగా మార్చిన విషయం తెలిసిందే. గతంలో ఒక్క గాంధీలోనే రోజుకు సగటున 3000 మంది ఓపీకి వచ్చేవారు. ఆస్పత్రి లో నిత్యం 1500 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందేవారు. ప్రస్తుతం ఇక్కడ సాధారణ వైద్యసేవలను నిలిపివేయడంతో ఇప్పటి వరకు అక్కడ చికిత్సలు పొందిన రోగులు అత్యవసర పరిస్థి తుల్లో ఉస్మానియాకు వస్తున్నారు. ఆస్పత్రిలో రోగుల నిష్పత్తికి తగినన్న ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉస్మానియాలో ప్రస్తుతం 6 కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. ఇది చాలా వరకు పాతభవనంలోని ఆపరేషన్ థియేటర్లు, పోస్టు ఆపరేటివ్ వార్డులకు అనుసంధానించబడి ఉంది.
కులీకుతుబ్‌షా, ఓపీ బ్లాక్‌లోని పోస్టు ఆపరేటీవ్ వార్డులకు ఆక్సిజన్ సరఫరా ఆశించిన స్థాయిలో జరగడం లేదు. 100 శాతం ప్రెషర్‌తో సరఫరా కావాల్సిన ఆక్సిజన్ 40 శాతం ప్రెషర్‌తో సరఫరా అవుతుంది. వెంటిలేటర్, ఆక్సిజన్‌లపై ఉన్న రోగులకు శ్వాస అందక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇటీవల మరో 2 కేఎల్ సామర్థ్యం ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయిచింది. ఈ పనులు పూర్తి అయ్యేందుకు మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రోగుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment