అంతా కోటీశ్వరులే. కారు రేసింగ్ వాళ్ల అభిరుచి. అందుకోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారు. మెర్సిడస్ బెంజ్, మాసరట్టి, పెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గిని వంటి ఒక్కొక్కటి రూ.2 కోట్లకు పైగా విలువైన కార్లు. అర్ధరాత్రి హైదరాబాద్ రహదారులపై ఈ కార్లను వాయువేగంతో పరుగెత్తించడం వాళ్లకు సరదా. కానీ ఈ వాహనాల పన్ను చెల్లింపులపైన మాత్రం తమ సంకుచిత బుద్ధినిప్రదర్శిస్తున్నారు. రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా పట్టుబడిన 11 వాహనాల నుంచే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మరో వందకు పైగా వాహనాల నుంచి రూ.100 కోట్ల మేర ఆదాయం రావచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వాహన యజమానులంతా పన్ను ఎగవేసేందుకే తమ వాహనాలను హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరిలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అధికారులు జప్తు చేసిన పదకొండు వాహనాల్లో కొన్ని హర్యానాకు చెందినవి కాగా..మరికొన్ని ఢిల్లీ, పాండిచ్చేరిల్లో నమోదైనట్లు అంచనా.
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఏ చిన్న వాహనం కొనుగోలు చేసినా సదరు వాహన యజమాని మోటారు వాహన నిబంధనల మేరకు షోరూమ్‌లోనే జీవితకాల పన్ను చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకుంటాడు. కానీ ఖరీదైన కార్లు కొనుగోలు చేసే బడాబాబులు మాత్రం ఆ పన్ను తప్పించుకొనేందుకు పక్కదారి పడుతున్నారు. నగరంలో ఇప్పుడిప్పుడే ఇలాంటి వారి బోగోతాలు వెల్లడవుతున్నాయి.
అక్కడ పన్ను తక్కువ..
వాహనాలపైన విధించే జీవితకాల పన్ను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. జీవిత కాల పన్ను ఏ మేరకు విధించాలనే అంశం రాష్ట్రాల పరిధికి చెందినది కావడంతో ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విధించారు. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో ఇది 5 శాతం నుంచి 7 శాతం వరకు ఉన్నట్లు అంచనా.
మహారాష్ట్రలో వాహనాల ఖరీదు మేరకు రకరకాల స్లాబుల్లో జీవితకాల పన్ను విధించారు.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడులలో ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment