millionare
-
Lok sabha elections 2024: రెండో విడతలో... నారీ శక్తి 8 శాతమే!
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్ జరగనుంది (మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో బీఎస్పీ అభ్యర్థి అశోక్ భలావి మరణంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది). రెండో దశలో 1,210 మంది పోటీలో ఉన్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడార్) విశ్లేíÙంచగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి...► రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతమే ఉన్నారు!► పట్టభద్రులు, ఆపై చదువులు చదివిన వారు 43 శాతం.► 21 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో 167 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ జాబితాలో కాంగ్రెస్ (35), తర్వాత బీజేపీ (31), సీపీఎం (14) టాప్‌లో ఉన్నాయి.► 390 మంది కోటీశ్వరులున్నారు. వీరిలో 105 మంది ఇండిపెండెంట్లు. తర్వాతి స్థానాల్లో బీజేపీ (64), కాంగ్రెస్ (62), బీఎస్పీ (24) నిలిచాయి. ఇద్దరికి 500 కోట్ల పైగా ఆస్తి ఉంది!► టాప్–10 సంపన్న అభ్యర్థుల్లో కర్నాటక టాప్‌లో ఉంది. మండ్య కాంగ్రెస్ అభ్యర్థి వెంటకరమణే గౌడ రూ.623 కోట్లతో ‘టాప్’ లేపారు. బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థి డీకే సురేశ్ రూ.593 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. హేమమాలినికి రూ.279 కోట్ల ఆస్తులున్నాయి. మధ్యప్రదేశ్‌లో హోషంగాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ శర్మ (రూ.233 కోట్లు), మండ్యలో జేడీ(ఎస్) చీఫ్ కుమారస్వామి (రూ.217 కోట్లు), యూపీలో అమ్రోహా బీజేపీ అభ్యర్థి కన్వర్ సింగ్ తన్వర్ (రూ.215 కోట్లు) టాప్–10లో నిలిచారు.► రెండో విడత అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.2 కోట్లు. ఆరుగురు తమకు చిల్లిగవ్వ కూడా లేదని ప్రకటించడం విశేషం!► అభ్యర్థుల్లో ఎక్కువ మంది 40–50 ఏళ్ల మధ్యవారే. సగటు వయసు 49 ఏళ్లు. 70–80 ఏళ్ల మధ్య వయసు్కలు 49 మంది ఉండగా ఇద్దరు 80 ఏళ్లు పైబడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆఫ్టర్ వన్ ఇయర్.. ఐ విల్ బీ ఏ కింగ్..
‘ఆఫ్టర్ వన్ ఇయర్ ఐ విల్ బీ ఎ కింగ్’ అనే ఫేమస్ డైలాగ్ మీకు గుర్తుందా? ఎందుకంటే.. భారతీయుల్లో ఎక్కువ మంది దాదాపు ఈ తరహా సిద్ధాంతాన్నే నమ్ముతున్నారు మరి. ఇంతకీ విషయం ఏమిటంటే.. భవిష్యత్‌లో డబ్బున్నోళ్లం కాగలమన్న ధీమా ప్రపంచంలో భారతీయుల్లోనే ఎక్కువట. ఎప్పటికైనా డబ్బు సంపాదించుకోగలమనే విశ్వాసాన్ని ఎక్కువ మంది భారతీయులు వ్యక్తం చేసినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాము ధనవంతులం అయ్యే అవకాశం అత్యంత ఎక్కువగా లేదా ఎక్కువగానే ఉందని పట్టణ ప్రాంతాలకు చెందిన భారతీయుల్లో 71 శాతం మంది తమ ఆన్లైన్ అధ్యయనంలో పేర్కొన్నట్లు స్టాటిస్టా గ్లోబల్ కన్జూమర్ సర్వే సంస్థ వెల్లడించింది. అలాగే సగటుకన్నా ఎక్కువ ధనాన్ని కూడబెట్టే అవకాశం తమకు ఉన్నట్లు 93 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డట్లు తెలిపింది. ఈ సర్వే ఫలితాల ప్రకారం.. వ్యక్తిగత ఆర్థిక విజయాలు సాధించే విషయంలో ఇతర దేశాల ప్రజలు ఏమంత ఆశాజనకంగా లేరు. మెక్సికో, అమెరికా, జర్మనీకి చెందిన ప్రజల్లో కేవలం 24–25 శాతం మంది మాత్రమే ధనవంతులు కాగలగడంపై కొంత స్పష్టతతో ఉన్నారు. అలాగే సుమారు 50 శాతం మంది మాత్రం తాము ధనవంతులం కాగలమని విశ్వసించేందుకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. యూకే, ఫ్రాన్స్‌లలో 40 శాతంకన్నా తక్కువ మంది ఈ ప్రశ్నకు సానుకూలంగా బదులివ్వగా వ్యక్తిగత ఆర్థిక విజయాలు సాధించడం తమకు అత్యంత కష్టమని 50%కన్నా ఎక్కువ మంది ఈ దేశాల ప్రజలు అభిప్రాయపడ్డారు. సర్వేలో పాల్గొన్న వివిధ దేశాల ప్రజల అభిప్రాయాలు (శాతాల్లో) చదవండి: పదేళ్ల క్రితం చేతిలో రూ.6,300.. ఇప్పుడేమో కోట్లు -
చదువుకి మధ్యలో ఫుల్ స్టాప్.. అప్పుడు తీసుకున్న రిస్క్ మిలియనీర్‌గా మార్చింది!
లండన్: చదువు అంతగా అబ్బలేదు. దీంతో 16 ఏళ్లకే స్కూల్‌కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. బతకడానికి డ్రైవింగ్ వృత్తిని ఎంచుకున్నాడు, ఉద్యోగంతో జీతం వస్తుంది గానీ జీవితం కాదని తెలుసుకున్నాడు. ఉన్న అనుభవంతో వ్యాపారాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి మిలియనీర్‌గా మారాడు యూకేలోని యోర్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ పార్కిన్. వివరాల్లోకి వెళితే.. స్టీవ్ పార్కిన్ తన చిన్నతనంలో చదవడమంటే పెద్దగా నచ్చేది కాదు. దీంతో 1992లో చదువు మానేసి హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ పొంది బతకడం కోసం డ్రైవర్‌గా మారాడు. అలా అతను చేసిన ఉద్యోగాలలో ఒకటి హడర్స్‌ఫీల్డ్ బోన్మార్చే దుస్తుల కంపెనీకి డ్రైవింగ్ చేయడం. ఇక అప్పటి నుంచి దొరికిన పని చేస్తూ జీవితంలో ముందుకు కదిలాడు. అయితే ఉద్యోగం కన్నా వ్యాపారమే మిన్నా అనే విషయం తెలుసుకున్నాడు. అయితే వ్యాపారం అంటే అంత సులువుగా కాదని తెలుసు కానీ ఆ సమయంలో రిస్క్ తీసుకుని తన దగ్గర ఉన్న డబ్బులు, అతనికున్న అనుభవంతో వ్యాపారం మొదలుపెట్టాడు. అలా చిన్నగా మొదలైన అతని క్లిప్పర్ అనే ఆన్లైన్ లాజిస్టిక్స్ కంపెనీని గత ఏడాది మాత్రమే £45 మిలియన్ (రూ. 450 కోట్లు) అర్జించే సంపన్నుడిగా మారాడు. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. యార్క్‌షైర్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో "మ్యాన్ విత్ ఎ వ్యాన్"గా ప్రారంభమైన పార్కిన్ 10వ స్థానంలో ఉన్నాడు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపారాలను ప్రభావితం చేసి, తిరోగమనం వైపు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కానీ ఇళ్లలో చిక్కుకుపోయిన ప్రజల కోసం.. కావాల్సిన వస్తువులను పంపించి తన కంపెనీ వాల్యూను ఒక్కసారిగా పెంచుకోగలిగాడు. ఈ సమ్మర్లోనే తన కంపెనీ టర్నోవర్ 39.1 శాతం పెరిగడంతో పాటు కంపెనీ విలువ కూడా 700 మిలియన్ పౌండ్లకు చేరింది. దీంతో ఇటీవలే మరో 2000 మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ప్రస్తుతం స్టీవ్ కంపెనీలో 10వేల మంది పనిచేస్తున్నారు. చదవండి: Frida Kahlo Paintings: బాప్రే! ఈ పేయింటింగ్ ధర రూ. 260 కోట్లా!! -
బ్యాంకులో మాస్క్ పెట్టుకోవాలి అన్నందుకు.. అధికారులకు దిమ్మతిరిగేలా షాకిచ్చాడు!
బీజింగ్: ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య కరోనా. మహమ్మారి కట్టడి కోసం మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం లాంటివి సర్వ సాధారణమయ్యాయి. మాస్క్ లేనివారిని జన సంచారమున్న ప్రాంతంలో, మాల్స్‌లో, బ్యాంకుల్లో కూడా అనుమతించడం లేదు. తాజాగా ఓ మిలియనీర్ మాస్కు పెట్టుకోకుండా బ్యాంకుకు వెళ్లాడు. అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఆ బిలియనీర్‌ని అడ్డగించి మాస్క్ ధరించకపోతే బ్యాంకులోకి అనుమతిలేదని తేల్చి చెప్పాడు. దీంతో సదరు మిలియనీర్ చేసిన పనికి బ్యాంకు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన చైనాలోని బ్యాంక్ ఆఫ్ షాంఘైలో చోటు చేసుకుంది. సెక్యూరిటీ గార్డు చెప్పిన విధానం నచ్చలేదో, లేదా అతని ప్రవర్తన నచ్చలేదో గానీ ఆ వ్యక్తి తన ఖాతాలోని డబ్బులన్నీ విత్ డ్రా చేసేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే నిబంధనల ప్రకారం.. ఒక రోజుకు 5 మిలియన్ల యువాన్లు (భారత కరెన్సీ ప్రకారం 5.8 కోట్లు) మాత్రమే బ్యాంకు నుంచి విత్‌డ్రా చేసుకునే పరిమితి ఉంది. దీంతో అంత సొమ్మును ఒకేసారి విత్ డ్రా చేశాడు ఆ బిలియనర్. ఇదిలా ఉంటే ఒకే కరెన్సీ కౌంటర్‌తో అంత పెద్ద మొత్తాన్ని లెక్కపెట్టడానికి బ్యాంకు సిబ్బందికి రెండు గంటలపైగా పట్టిందట. అంతటి ఆగకుండా తన ఖాతాలో డబ్బు మొత్తం విత్ డ్రా చేసే వరకూ ప్రతిరోజూ ఇదే సీను రిపీట్ అవుతుందని ఆ మిలియనీర్ చెప్పాడట. అలా విత్ డ్రా చేసిన డబ్బును వేరే బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి డబ్బులు ఉన్న సూట్‌కేసులను తన లగ్జరీ కారులో తీసుకెళ్తున్న ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. చదవండి: Viral Video: గిఫ్ట్ బాక్స్ చూసి షాక్ అయిన వధువు..ఇంతకీ అందులో ఏమందంటే..! -
పేరుకి కోటీశ్వరులు.. మరి అందులో కక్కుర్తి ఎందుకో
అంతా కోటీశ్వరులే. కారు రేసింగ్ వాళ్ల అభిరుచి. అందుకోసం ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తారు. మెర్సిడస్ బెంజ్, మాసరట్టి, పెరారీ, రోల్స్ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గిని వంటి ఒక్కొక్కటి రూ.2 కోట్లకు పైగా విలువైన కార్లు. అర్ధరాత్రి హైదరాబాద్ రహదారులపై ఈ కార్లను వాయువేగంతో పరుగెత్తించడం వాళ్లకు సరదా. కానీ ఈ వాహనాల పన్ను చెల్లింపులపైన మాత్రం తమ సంకుచిత బుద్ధినిప్రదర్శిస్తున్నారు. రవాణా శాఖకు చెల్లించాల్సిన పన్ను చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా పట్టుబడిన 11 వాహనాల నుంచే రూ.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న మరో వందకు పైగా వాహనాల నుంచి రూ.100 కోట్ల మేర ఆదాయం రావచ్చునని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ వాహన యజమానులంతా పన్ను ఎగవేసేందుకే తమ వాహనాలను హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరిలలో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అధికారులు జప్తు చేసిన పదకొండు వాహనాల్లో కొన్ని హర్యానాకు చెందినవి కాగా..మరికొన్ని ఢిల్లీ, పాండిచ్చేరిల్లో నమోదైనట్లు అంచనా. సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా ఏ చిన్న వాహనం కొనుగోలు చేసినా సదరు వాహన యజమాని మోటారు వాహన నిబంధనల మేరకు షోరూమ్‌లోనే జీవితకాల పన్ను చెల్లించి వాహనాన్ని సొంతం చేసుకుంటాడు. కానీ ఖరీదైన కార్లు కొనుగోలు చేసే బడాబాబులు మాత్రం ఆ పన్ను తప్పించుకొనేందుకు పక్కదారి పడుతున్నారు. నగరంలో ఇప్పుడిప్పుడే ఇలాంటి వారి బోగోతాలు వెల్లడవుతున్నాయి. అక్కడ పన్ను తక్కువ.. వాహనాలపైన విధించే జీవితకాల పన్ను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. జీవిత కాల పన్ను ఏ మేరకు విధించాలనే అంశం రాష్ట్రాల పరిధికి చెందినది కావడంతో ఇలా వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు విధించారు. ఈ మేరకు కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో ఇది 5 శాతం నుంచి 7 శాతం వరకు ఉన్నట్లు అంచనా. మహారాష్ట్రలో వాహనాల ఖరీదు మేరకు రకరకాల స్లాబుల్లో జీవితకాల పన్ను విధించారు.తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడులలో ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో ఖరీదైన వాహనాల పైన 14 శాతం వరకు జీవితకాల పన్ను విధించారు. అంటే రూ.2 కోట్ల ఖరీదైన వాహనంపైన సుమారు రూ.70 లక్షల వరకు పన్ను కట్టాల్సివుంటుంది. ఈ పన్నును ఎగ్గొట్టేందుకే వాహనదారులు ఇతర రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. హర్యానా, ఢిల్లీ, పాండిచ్చేరి, తదితర చోట్ల కేవలం రూ.30లక్షలలోపు జీవిత కాలపన్నుతో వాహనాలు నమోదు కావడంతో నగరవాసులను ఆ రాష్ట్రాలను ఎంపిక చేసుకుంటున్నారు. -
కొడుకు కోసం చెత్తని పోగుచేస్తే.. అదే అదృష్టంగా మారింది
చెట్టంత కొడుకు పనీపాటా లేకుండా ఇంట్లోనే కూర్చొని తింటూంటే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? చీవాట్లు పెట్టి బుద్ది చెపుతారు. పని వెదుక్కొని ఇంటి అవసరాలకు చేదోడువాదోడు అవమని కోరతారు. కానీ సౌత్‌కొరియాలో.. ఓ తండ్రి మాత్రం అలాంటి బద్ధకిస్టు కొడుకు మీద నిరసనగా ఇంటి నిండా చెత్తను పోగు చేయటం ప్రారంభించాడు. అది కూడా దశాబ్దంపాటు. అలా పోగైన చెత్త వాసనకు అతని భార్య అనారోగ్యం పాలయింది. డాక్టర్ల సలహా మేరకు వెంటనే ఆ చెత్తను తొలగించాల్సిన పరిస్థతి వచ్చింది. అందులో భాగంగా ఆ చెత్తనంతా అమ్మితే అతనికి రూ. 36 కోట్లు లభించాయి. అదంతా చూసిన చుట్టుపక్కల వాళ్లు ‘కొడుకు కోసం చెత్తనే ఆస్తిగా పోగుచేసినట్లుందే’ అని బుగ్గలు నొక్కుకున్నారట. నిజానికి ఆ తండ్రి అనుకున్నదొకటి.. అయినది ఇంకొకటి. ఇంట్లో చెత్తను పేర్చితే భరించలేక కొడుకు బయటకు వెళ్లి ఏదైనా పని చేసుకుంటాడని ఆ తండ్రి ఆలోచన! ఏదైతేనేం పనిచేయని కొడుక్కి చెత్తతో ఆస్తిని సంపాదించి పెట్టాడు. ఇది దక్షిణకొరియాలో చోటు చేసుకుంది. -
అమ్మేవి చాయ్, సమోసాలు సంపాదన మాత్రం కోట్లు!
సాధారణంగా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షలు అర్జించే వారు కోట్లు వెనకేసుకోవడం మనకి తెలిసిందే. అయితే రోడ్డు పై టీ స్టాల్, సమోసా అమ్మకునే వ్యక్తులు కూడా ఇలా కోట్లు కూడబెడుతున్నారని మీకు తెలుసా. ఈ నమ్మలేని నిజాలు కాన్పూర్‌లోని జీఎస్టీ, ఆదాయ శాఖ అధికారుల పరిశీలనలో బయటపడ్డాయి. అక్కడ పలు ప్రాంతాల్లో రహదారిపై చాట్, క్రిస్పీ-కచోరి, చాయ్-సమోసా, పాన్ షాపుల వాళ్లలో కొందరు కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంట. ఈ పుట్ పాత్ వ్యాపారులంతా ఆహార భద్రతకు భరోసా ఇచ్చే ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్ తీసుకోకుండా చాలా సంవత్సరాలుగా ఈ వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. కొందరు పేదలుగా కనిపించే ఈ కనపడని కోటీశ్వరులపై ఆదాయపు పన్ను శాఖ నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ రిజిస్ట్రేషన్ దర్యాప్తులో 256 మంది వ్యాపారులు మిలీనియర్లుగా బయటకు పడ్డారు. డేటా సాఫ్ట్వేర్, ఇతర సాంకేతిక పరికరాల సహాయంతో వారి వివరాలను పరిశీలించినప్పుడు, ఐటి విభాగం అధికారులు సైతం నివ్వెరపోయారు. వీరిలోని చాలా మంది వద్ద ఖరీదైన కార్లు, ఎకరాల్లో భూములు లాంటివి కోనుగులు చేస్తూ ఆస్తులు భారీగానే కూడబెడుతున్నారని తెలిపారు. వీరు ఇప్పటివరకు ఒక్క పైసా పన్ను కూడా చెల్లించకుండా వ్యాపారం నడుపుతున్నారని వెల్లడించారు. హిందూస్థాన్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం, ఈ వ్యాపారులు జిఎస్టి రిజిస్ట్రేషన్ వెలుపల ఒక్క పైసా కూడా పన్ను చెల్లించలేదట. కాని నాలుగేళ్లలో 375 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొనుగోలు చేశారని వెల్లడించింది. ఆర్యనగర్, స్వరూప్ నగర్, బిర్హానా రోడ్, హులగంజ్, పిరోడ్, గుమ్తి వంటి చాలా ఖరీదైన వాణిజ్య ప్రాంతాలలో పలు ఆస్తులను కొనుగోలు చేశారని, దక్షిణ కాన్పూర్‌లో కూడా ఆస్తులు కొన్నారని తెలిపింది. ప్రస్తుతం అధికారులు ఈ విషయాలపై పూర్తి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. -
నవయువం : మిలియన్ డాలర్ బేబీ
ఉత్సాహం మార్పును ఒడిసి పట్టుకోగలుగుతుంది. నవ్యతకు స్వాగతం పలుకుతుంది. అద్భుతాలను సాధించగలుగుతుంది. మార్గదర్శకంగా నిలుస్తుంది. అలాంటి ఉత్సాహం మిలియనీర్‌ను చేస్తుంది. అందుకు సాక్షి మిచిగాన్(యుఎస్)కు చెందిన ఆష్లే క్వాల్స్... ‘‘ఫ్యాషన్ ట్రెండ్స్ విషయంలో పాశ్చాత్య యువతకు దిశానిర్దేశం చేసేవి సెవెంటీన్, టీన్వోగ్, కాస్మోగర్ల్.. ఈ మూడు మ్యాగ్జిన్లను ఎంతమంది కొని చదువుతున్నారో.. ఈ 22 యేళ్ల అమ్మాయి వెబ్‌సైట్‌ను అంతే మంది చూస్తున్నారు...’’ ఆష్లే క్వాల్స్ గొప్పతనం గురించి ప్రఖ్యాత ‘ఫోర్బ్స్’ ప్రస్తావించింది. 14 యేళ్ల వయసులో వెబ్‌పేజ్‌ల డిజైనింగ్ ను ఒక హాబీగా ప్రారంభించింది క్వాల్స్. మైస్పేస్ సైట్లో తన స్నేహితుల అకౌంట్స్ కోసం వెబ్‌పేజ్‌లను డిజైన్ చేసేది. తర్వాతి రోజుల్లో ఆ హాబీ ఒక వ్యాపారంగా మారింది. పేజ్ లేఔట్లను డిజైన్ చేయడానికి ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. వాట్‌ఎవర్‌లైఫ్.కామ్ అనే వెబ్‌సైట్‌తో తన వ్యాపారాన్ని ఆన్‌లైన్‌కు అనుసంధానించింది ఆష్లే. అచిరకాలంలోనే ఆ వెబ్సైట్ పాపులర్ అయ్యింది. రెడీమేడ్ పేజ్‌ల వ్యాపారం.. సోషల్నెట్వర్కింగ్ మ్యానియాను క్యాష్ చేసుకొనే వ్యాపారం ఇది. ఫేస్బుక్, మై స్పేస్ వంటి సైట్ల యూజర్లకు ఆష్లే రెడీ మేడ్ వెబ్‌పేజ్‌లను అందిస్తుంది. నిరంతం హోమ్ పేజ్ డిజైన్లను మార్చడానికి ఇష్టపడే యువతకు అష్లే ప్రారంభించిన సైట్ మంచి విందు భోజనంగా మారింది. ఆ సైట్ నుంచి కొత్త డిజైన్స్‌ను తమ పేజ్‌లకు అనుసంధానించుకోవడం మొదలుపెట్టారు. అలా వాట్‌ఎవర్‌లైఫ్.కామ్ సూపర్‌సక్సెస్ అయ్యింది. ఆష్లే సైట్‌ను నెలకు దాదాపు 70 లక్షల మంది సందర్శిస్తున్నారు. దాదాపు ఆరు కోట్ల వ్యూలు ఉంటున్నాయి. వారందరికీ ఇక్కడ ఉచితంగా వెబ్‌పేజ్‌లు అందుబాటులో ఉంటాయి. విజిట్స్ ఎక్కువగా ఉండటంతో ఆష్లే పేజ్‌కు యాడ్స్ వస్తాయి. యాడ్స్ రూపేణా డబ్బు వస్తుంది. లక్షల డాలర్లను కాదంది... 2009లోనే వాట్‌ఎవర్‌లైఫ్.కామ్ సైట్‌ను కొనడానికి ఒక కార్పొరేట్ సంస్థ ముందుకొచ్చింది. 15 లక్షల డాలర్ల డబ్బు, లక్ష డాలర్లు విలువ జేసే కారును ఆఫర్ చేసి వెబ్‌సైట్‌ను కొనడానికి ప్రయత్నించింది ఆ సంస్థ. ఆష్లే ఆ ఆఫర్‌ను నిరాకరించింది. వెబ్సైట్ తన చేతిలోనే ఉండటం వల్ల డబ్బుకు మించిన క్రేజ్‌ను సంపాదించవచ్చని ఆష్లే అభిప్రాయం. తనే సొంతంగా అనేక మందికి ఉపాధిని అందిస్తున్నాననే తృప్తి కూడా ఉంటుంది. ప్రస్తుతానికి వెబ్సైట్ ద్వారా ఆష్లేకు 20 లక్షల డాలర్ల ఆదాయం వచ్చి ఉంటుందని ‘ఫోర్బ్స్’ పత్రిక అంచనా. అష్లే ఒక సెలబ్రిటీ... ఇప్పుడు ఆష్లే ఒక సెలబ్రిటీ. ఆమె ఏదైనా సినిమా గురించి మాట్లాడినా, సోషల్ట్రెండ్స్ గురించి మాట్లాడినాఅదొక వార్త అవుతోంది. యువతలో సోషల్నెట్వర్కింగ్ ఫీవర్ కొనసాగినంత వరకూ తనకు తిరుగే ఉండదు అనే ఆత్మవిశ్వాసంతో ఉంది ఆష్లే. తిరుగులేదు... ఎవరైనా ఫేస్‌బుక్‌లోనో, మై స్పేస్‌లోనో హోమ్‌పేజ్‌ను మార్చుకోవాలని ఆలోచన వస్తే ఆష్లే వెబ్సైట్ వైపు చూడాల్సిందే. అలా తన ప్రాధాన్యతను కాపాడుకొంటోంది ఆష్లే. అందుకు తగ్గ ఉత్సాహం, ముందుచూపు తనకున్నాయని ఆష్లే అంటోంది.