విద్యకు ‘నూతన’ జవసత్వాలు! | Teacher Appointments in Government Schools: telangana | Sakshi
Sakshi News home page

విద్యకు ‘నూతన’ జవసత్వాలు!

Published Tue, Jan 2 2024 2:03 AM | Last Updated on Tue, Jan 2 2024 10:07 AM

Teacher Appointments in Government Schools: telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరంలో విద్యా రంగం వినూత్న జవసత్వాలను సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గణనీయ మార్పులు, కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖపై జరిపిన సమీక్ష తర్వాత రాష్ట్రంలో మార్పులపై సంకేతాలు వస్తున్నాయి.

ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ స్థాయి వరకు కొత్త అడుగులు పడవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయిలో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) వంటి సంస్థలు కూడా ఈ ఏడాది కీలక సంస్కరణల అమలుకోసం సిద్ధమవుతున్నాయి. 

ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఆశలు 
రాష్ట్రంలో 26 వేలకుపైగా ప్రభుత్వ బడులు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 12 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్లకు పదోన్నతులు కలి్పస్తే మరో 10 వేల వరకు పోస్టులు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 22 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉండనుంది. గత ఏడాది 5 వేల పైచిలుకు పోస్టుల భర్తీకి కార్యాచరణ చేపట్టినా అడుగు ముందుకు పడలేదు.

అయితే త్వరలో మెగా డీఎస్సీ చేపడతామని రాష్ట్ర సర్కారు ప్రకటించడం విద్యాశాఖలో ఆశలు రేపుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేవలం ఏడు జిల్లాల్లోనే పర్యవేక్షణ అధికారులు ఉన్నారు. దీంతో విద్యలో నాణ్యత తగ్గిందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు పదోన్నతులు, బదిలీలు కూడా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం టీచర్లలో హర్షం వ్యక్తమవుతోంది. 

కాలేజీ విద్యకూ మంచి రోజులు 
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 2,400 బోధన సిబ్బంది పోస్టుల భర్తీ కోసం గత ఏడాది ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. కానీ రోస్టర్‌ పాయింట్‌ విషయంలో న్యాయపరమైన ఇబ్బందితో భర్తీ ప్రక్రియ ముందుకు కదల్లేదు. నిజానికి రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్‌ అధ్యాపకులు 1,200 మందే ఉన్నారు. 4,007 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది.

జూనియర్‌ కాలేజీల్లో 6,008 పోస్టులుంటే.. 4 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు అవసరమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. కొత్త ఏడాదిలో కాలేజీ విద్యకు మంచిరోజులు వచ్చినట్టేనని అంటున్నారు. ఇక రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3 వేల అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

మరోవైపు ఉన్నత విద్యా మండలి, విశ్వవిద్యాలయాల ప్రక్షాళన, సమన్వయ పాలన వ్యవహారాలపై సర్కారు దృష్టి పెట్టిందని.. ఇవన్నీ 2024 ఏడాదిలో కీలక పరిణామాలకు దారి తీయవచ్చని అంటున్నారు. 

పరీక్షలకు సన్నద్ధమయ్యేలా.. 
ఫిబ్రవరిలో ఇంటర్, మార్చిలో టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. గతంలో పేపర్‌ లీకులు, ఇంటర్‌ ఫలితాలపై విద్యార్థుల ఆందోళన వంటివి చోటు చేసుకున్నాయి. దీంతో ఈసారి ప్రభుత్వం పరీక్షలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం, విద్యార్థులను ముందు నుంచే సన్నద్ధం చేస్తూ భయం పోగొట్టడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు అధికారులు చెప్తున్నారు. 

మారుతున్న సిలబస్‌.. 
ఈ ఏడాది నుంచి పాలిటెక్నిక్‌ సిలబస్‌ మారనుంది. విదేశాల్లోని డిప్లొమా చదువులకు అమలు చేస్తున్న పాఠ్య ప్రణాళికను ఆధారంగా చేసుకుని కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఒక్కో డిప్లొమా బ్రాంచీకి ఒక్కో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. సింగపూర్, చైనా దేశాల్లోని సిలబస్‌లను ఈ కమిటీలు పరిశీలిస్తాయి. పాలిటెక్నిక్‌ విద్యలో ఇంటర్న్‌షిప్, ఆన్‌లైన్‌ మూల్యాంకనం, ఓపెన్‌ బుక్‌ విధానం వంటి సంస్కరణలు తీసుకొచ్చే అవకాశం ఉంది. 

మరిన్ని డీమ్డ్‌ వర్సిటీలు 
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఈ ఏడాది కీలక మార్పులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. డీమ్డ్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు నిబంధనలను మరింత సరళతరం చేస్తోంది. ఇప్పటికే సంబంధిత ముసాయిదాపై అన్ని వర్గాల ఆమో దం తీసుకున్నారు. మూడేళ్లు వరుసగా న్యాక్‌ ఏ ప్లస్‌తోపాటు గ్రేడ్‌లో నాలుగు పాయింట్లకుగాను కనీసం 3.4 పాయింట్లు సాధించిన కాలేజీలకు డీమ్డ్‌ హోదా ఇవ్వాలని యూజీసీ నిర్ణయించింది.

దీనిని బట్టి తెలంగాణలో పది కాలేజీలకు డీమ్డ్‌ హోదా లభించే వీలుంది. మరోవైపు విదేశీ విద్యాలయాలు మన దేశంలో బ్రాంచీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వాటికి యూజీసీ, సాంకేతిక విద్యా మండలి సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. విదేశీ యూనివర్సిటీల రాకతో విద్యా బోధనలో మార్పు రావొచ్చని నిపుణులు చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement