సాక్షి, హైదరాబాద్: అగ్రికల్చర్ ఎంసెట్ పరీక్షలను ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏర్పాటు చేసిన 84 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు దాదాపు 79 వేల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణలోని 67 కేంద్రాల్లో 62,800 మంది, ఏపీలోని 17 కేంద్రాల్లో 16,200 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వివరించారు. ఆన్‌లైన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు మరొక సెషన్ ఉంటుందని వివరించారు.
పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను గంటన్నర ముందు నుంచే అనుమతిస్తామని, వీలైనంత ముందుగా చేరుకోవాలని సూచించారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని పేర్కొన్నారు. సోమవారం పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులకు ఆదివారమే మెసేజ్ పంపించామని, 29వ తేదీన పరీక్షకు హాజరు కావాల్సిన వారికి సోమవారం మెసేజ్ పంపిస్తామని వెల్లడించారు. కరోనా సంబంధిత లక్షణాలు... జలుబు, జ్వరం, దగ్గు వంటివి తమకు లేవని విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వాటిపై డాక్టర్ల సంతకం అవసరం లేదన్నారు. అలాగే విద్యార్థుల హాల్ టికెట్‌పై గెజిటెడ్ అధికారి సంతకం తప్పనిసరి కాదన్నారు. విద్యార్థులు ఓటర్ ఐడీ, ఆ«ధార్ వంటి ఏదో ఒక ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు.
డిగ్రీ రెండో దశ సీట్ల కేటాయింపు వచ్చేనెల 1న
డిగ్రీ రెండో దశ సీట్ల కేటాయింపును అక్టోబర్ 1వ తేదీన ప్రకటించనున్నట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. రెండో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా 79,928 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారని పేర్కొన్నారు. మొదటి దశలో సీట్లు పొందిన 1,41,340 మందిలో 1,07,436 మంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment