మాణిక్యం ఠాగూర్‌తో మాట్లాడుతున్న రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రైతాంగానికి ఏం చేస్తామో చెప్తూ రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిరుద్యోగుల కోసం డిక్లరేషన్ ప్రకటించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరోసారి ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆగస్టు 21న సిరిసిల్లలో రాహుల్ సభ నిర్వహించే అవకాశముందని, అయితే తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అక్కడ జరిగే భారీ బహిరంగసభలో నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఏఐసీసీ నుంచి సమాచారం అందిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో పొలిటికల్ అఫైర్స్, రాష్ట్ర కార్యవర్గం, డీసీసీల సమావేశం జరిగింది.
సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ ఇన్‌చార్జి కార్యదర్శి బోసు రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. అనంతరం మహేశ్‌కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ కల్పన అంశాలతోపాటు అనేక విషయాలను డిక్లరేషన్‌లో రాహుల్ ప్రకటిస్తారని తెలిపారు. ఈ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో గురించిన కొన్ని అంశాలను కూడా వెల్లడించే అవకాశాలున్నాయన్నారు.
నేడు కాంగ్రెస్ నేతలకు విందు
రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త కార్యవర్గం ఏర్పాటై ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఆదివారం జూబ్లీహిల్స్ క్లబ్‌లో పార్టీ నాయకులకు విందు ఏర్పాటు చేసినట్టు మహేశ్‌గౌడ్ తెలిపారు. పీఏసీ సభ్యులు, మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు.. ఇలా నేతలంతా ఒకచోట కలిసి మాట్లాడుకోవడానికిగాను ఈ విందు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రైతు డిక్లరేషన్‌లో ఉన్న అంశాలను రచ్చబండ ద్వారా 70 శాతం గ్రామాల్లో ప్రజలకు వివరించామని, అయితే డీసీసీల అభ్యర్థన మేరకు మరికొన్ని రోజులు ఈ కార్యక్రమాన్ని పీసీసీ పొడిగించిందని చెప్పారు.
అసమ్మతిపై హైకమాండ్ సీరియస్
రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతిపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందనే విషయం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. అసమ్మతి నేతలు మీడియాతో మాట్లాడుతున్న వ్యవహారాన్ని ఏఐసీసీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని, ఇలాంటివాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని, ఇది పార్టీ అధిష్టానం హెచ్చరిక అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ చెప్పినట్లు సమాచారం.
పార్టీలోకి ఎవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోకూడదన్న అంశాలపై అధిష్టానానికి నివేదిక అందిన తర్వాతే పార్టీలోకి చేరికలు ఉంటున్నాయని, దీనిపై నేతలు ఇష్టారాజ్యంగా బహిరంగంగా మాట్లాడితే బహిష్కరణ వేటుకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించినట్టు తెలిసింది. అదే విధంగా రాహుల్ సభ తేదీలపై మరింత క్లారిటీ తీసుకోవాల్సి ఉందని, పార్లమెంట్ సమావేశాలు, ఇతర రాష్ట్రాల్లో రాహుల్ పర్యటనలను దృష్టిలో పెట్టుకొని తేదీలను ఫైనల్ చేయాల్సి ఉందని మాణిక్యం చెప్పినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment