
సాక్షి, హైదరాబాద్: దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమపథకాలను తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, ముస్లింల సంక్షేమానికి ఇక్కడ తీసుకున్నన్ని చర్యలు మరేరాష్ట్రంలో లేవని మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసి అన్నారు. ఈ సంక్షేమ పథకాల అమలు వెనక మజ్లిస్‌పార్టీ కూడా ఉందని, తాము చేసిన ఎన్నో సూచనలు, సలహాలను స్వీకరించి ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వెరసి టీఆర్‌ఎస్– మజ్లిస్ పార్టీల సంయుక్త ఆలోచనలతో తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని చెప్పారు. షాదీముబారక్ పథకం రూపకల్పనలో కూడా తన సూచనలున్నాయని గుర్తుచేశారు.
రాష్ట్రంలో సంక్షేమపథకాల అమలు అంశంపై శుక్రవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో అక్బరుద్దీన్ పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ హయాంలోనే కాదు, తమ హయాంలో కూడా సంక్షేమ పథకాలను గొప్పగా అమలు చేశామని కాంగ్రెస్‌పార్టీ సభాపక్ష నేత భట్టి విక్రమార్క చెప్పుకొంటున్నారని, అదే నిజమైతే వరసగా రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఎందుకు నిలవలేదని ప్రశ్నిం చారు. తాను ప్రభుత్వాన్ని విమర్శించటంలో మాత్రం వెనకకుపోనని లోపాలున్నా నిలదీస్తానని స్పష్టం చేశారు. తాను చేసే విమర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నారాజ్ కారని, తాను చేసే ఆరోపణలను ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చేసేవేనని ఆయనకు తెలుసునన్నారు.
Comments
Please login to add a commentAdd a comment