సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సమావేశాల నిర్వహణకు నేడో రేపో నోటిఫికేషన్ విడుదలకానుంది. మూడు నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్‌లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెలలో నిర్ణయించారు.
దాదాపు వారం రోజుల పాటు సమావేశాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం ఆంక్షలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పిన విషయం తెలిసిందే. అభివృద్ధి బాటలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసర ఆంక్షలతో 2022 –23 ఆర్థిక సంవత్సరం ఆదాయంలో రూ.40 వేల కోట్లకుపైగా తగ్గుదల నమోదైందని గత నెలలో సీఎం ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిని ముందుకు సాగకుండా కేంద్రం అడ్డుకట్ట వేస్తున్న తీరును అసెంబ్లీ వేదికగా వివరించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment