
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో రాష్ట్ర బీసీ కమిషన్ మూడురోజుల పర్యటన శుక్రవారం ముగిసింది. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద్ పటేల్, కె.కిశోర్‌గౌడ్‌లు వివిధ అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చించారు. శుక్రవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు.
అక్కడ అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లతోపాటు కులగణనకు సంబంధించిన అంశాలను చర్చించారు. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణ, సమాచార సేకరణలో అవలంబించాల్సిన పద్ధతులు తదితర అంశాలపై తమిళనాడులో అధ్యయనం చేసినట్లు స్టాలిన్‌కు చెప్పారు. అనంతరం ఆ రాష్ట్ర బీసీ, ఎంబీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజకన్నప్పన్, బీసీ, ఎంబీసీ శాఖ ముఖ్య కార్యదర్శి కార్తీక్, పీఆర్ అండ్ ఆర్‌డీ ముఖ్యకార్యదర్శి ఆముదలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. చివరగా ఈవీ పెరియార్ రామస్వామి స్మారక స్థలాన్ని సందర్శించారు.