సమావేశంలో మాట్లాడుతున్న కృష్ణయ్య
కాచిగూడ (హైదరాబాద్): తెలంగాణలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయకుండా కొంతమంది ఉద్యోగులు దొడ్డిదారిన తాత్కాలికంగా ఉద్యోగాలను భర్తీ చేస్తూ, పదోన్నతులు కల్పిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. ఉద్యోగాల భర్తీలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
కాచిగూడలో శనివారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణతో పాటు ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. గ్రూప్ –4 ద్వారా 9,164 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ వేశారని, పోస్టులను 25వేలకు పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూపు –3 ద్వారా ప్రకటించిన 1,300 పోస్టులను 8వేలకు పెంచాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని ఖాళీల భర్తీకి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment