సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పట్నుంచే సిద్ధమవుతోంది. గతానికి భిన్నంగా కనీసం సగం స్థానాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని భావిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే 50–60 సీట్లకు అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. 2018 డిసెంబర్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్‌ఎస్ ఒకేసారి 105 మందితో జాబితా ప్రకటించి సంచలనం సృష్టించగా బీజేపీ మాత్రం అభ్యర్థుల ఖరారులో తీవ్ర జాప్యంతో నామినేషన్ల గడువు ముగిసే దాకా జాబితాను ప్రకటించలేకపోయింది.
దీని ప్రభావం ఫలితాలపైనా కనిపించింది. కేవలం ఒక సీటుకే ఆ పార్టీ పరిమితమైంది. బీజేపీ ముఖ్య నేతలంతా ఓటమి పాలవడంతోపాటు 100కుపైగా సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. నాడు తలెత్తిన ఇబ్బందులు, సమస్యలు తదితర అంశాలపై జాతీయ నాయకత్వానికి ప్రస్తుత రాష్ట్ర పార్టీ నివేదిక సమర్పించింది. అలాంటి పరిస్థితి మళ్లీ ఎదురుకాకుండా ఉండేందుకు ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనకు అనుమతివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ జాతీయ నాయకత్వం కీలక సూచనలు చేసినట్లు సమాచారం. పార్టీకి, అభ్యర్థులకు పట్టున్న సీట్లలో అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ముసాయిదా జాబితా రెడీ..
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే కొన్నింటిలో ఒకరు, మరికొన్నిం ట్లో ఇద్దరేసి, మిగిలిన చోట్ల ము గ్గురేసి చొప్పున అభ్యర్థులతో ముసాయిదా జాబితా సిద్ధమైనట్లు బీజేపీ నేతలు చెబుతున్నా రు. ఒక్కరే అభ్యర్థుల స్థానాలతోపాటు ముఖ్య నేతలు, వివిధ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు, కచ్చితంగా గెలిచే అవకాశాలున్న నేతల్లో 50–60 మందిని త్వరలోనే ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియోజకవర్గాల్లోనూ కొందరికి పార్టీ తరఫున ఎన్నికల అభ్యర్థిగా పని మొదలుపెట్టాలని కూడా నాయకత్వం సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంసిద్ధంగా లేని వారు, ఆసక్తిలేని రాష్ట్రస్థాయి ముఖ్య నేతలకు లోక్‌సభ నియోజకవర్గాలవారీగా కీలక బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.
రాష్ట్ర పర్యటనకు జాతీయ నేతలు...
పార్టీ ఎన్నికల సంసిద్ధతను వేగవంతం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ నేతలు త్వరలోనే రాష్ట్ర పర్యటనకు రానున్నారు. వచ్చే నెల 14 నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నెలలోనే జనగామ లేదా మరో ప్రాంతంలో నిర్వహించే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొననున్నారు.
ఈ నెల 21 నుంచి 24 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. 21న జనగామలో, 22న వికారాబాద్ తదితర చోట్ల జిల్లాస్థాయి నాయకులతో ఎన్నికల సన్నద్ధతపై సమాలోచనలు జరపనున్నారు. పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌జీ, సంయుక్త కార్యదర్శి శివప్రకాష్‌జీ రాష్ట్ర పార్టీ సంస్థాగత పటిష్టతపై పర్యవేక్షించనున్నారు. సంతోష్‌జీ, శివప్రకాష్‌జీ త్వరలోనే తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నట్లు సమాచారం. త్వరలో నిర్వహించే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల జోనల్ సమావేశంలో శివప్రకాష్‌జీ పాల్గొని పార్టీ బలోపేతంపై స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment