తెలంగాణ కేబినెట్‌ కీల‌క నిర్ణ‌యాలు ఇవే | Telangana Cabinet to Meet Key Topics approved By Govt | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్‌ కీల‌క నిర్ణ‌యాలు ఇవే

Published Sat, Dec 10 2022 8:34 PM | Last Updated on Sat, Dec 10 2022 9:25 PM

Telangana Cabinet to Meet Key Topics approved By Govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు పలు రంగాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న అభివృద్ధికి అనుగుణంగా రోడ్లు భవనాల శాఖలో పని విస్తృతి పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా శాఖలోని పలు విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 

రోడ్లు భవనాల శాఖలో అధికార వికేంద్రీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, అవసరమైన మేరకు నూతన కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకోసం అదనపు నిధులను కూడా మంజూరు చేసింది. ఇందులో భాగంగా రోడ్లు భవనాల శాఖ చేసిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా అత్యవసర సమయాల్లో అధికారులు స్వీయ నిర్ణయంతో ప్రజావసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేందుకు కేబినెట్ అవకాశమిచ్చింది.

పోలీస్‌శాఖలో నియామకాలు
రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్‌లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు  ఆమోదం తెలిపింది.

గురుకులాల్లో పోస్టుల భ‌ర్తీ
తెలంగాణ మంత్రివ‌ర్గం మ‌హాత్మా జ్యోతి బాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థ‌ల‌కు సంబంధించి కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. బీసీ గురుకులాల్లోని ప‌లు విభాగాల్లో పోస్టుల భ‌ర్తీకి ఆమోదం తెలిపింది. మొత్తం 2,591 నూత‌న ఉద్యోగాల నియామ‌కాల‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.

వరాలు...
రోడ్లు భవనాల శాఖలో పెరిగిన పనికి అనుగుణంగా శాఖను పునర్ వ్యవస్థీకరించేందుకు కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖలోని పలు విభాగాల్లో మొత్తం 472 అదనపు పోస్టులను కేబినెట్ మంజూరు చేసింది. ఇందులో.. కొత్తగా 3 చీఫ్ ఇంజనీర్ పోస్టులు, 12 సూపరిండెంట్ ఇంజనీర్ పోస్టులు, 13 ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు, 102 డి.ఈ.ఈ పోస్టులు, 163 అసిస్టెంట్ ఈ.ఈ పోస్టులు, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు టెక్నికల్, నాన్ టెక్నికల్ సిబ్బంది పోస్టులున్నాయి. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. దాంతో పాటు సత్వరమే పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. 
చదవండి: పోలీస్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

పెరిగిన నూతన ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలన బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బి శాఖ లోని.., రోడ్లు, భవనాలు, ఎలక్ట్రికల్, జాతీయ రహదారుల విభాగాల్లో... 3 చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలను., 10 సర్కిల్ కార్యాలయాలను., 13 డివిజన్ కార్యాలయాలను., 79 సబ్ డివిజన్ కార్యాలయాలను  ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి శాఖను కేబినెట్ ఆదేశించింది.

రోడ్లు భవనాల శాఖను మరింత పటిష్ట పరిచేందుకు ప్రజావసరాల దృష్ట్యా పనులు చేపట్టేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి అదనంగా నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల (పీరియాడిక్ రెన్యువల్స్) కోసం, కూ. 1865 కోట్లను మంజూరు చేసింది. వానలు, వరదలు తదితర ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా రోడ్లు తెగిపోవడం, కొట్టుకుపోవడం వంటి సందర్భాల్లో  ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగు పరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు గాను.. రూ. 635 కోట్ల నిధులను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

వానలు వరదలు తదితర ప్రకృతి విపత్తుల సందర్భంలో, ప్రజావసరాలకు అనుగుణంగా, అసౌకర్యాన్ని తొలగించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు.. వీలుగా కింది స్థాయి డీఈఈ నుంచిపై స్థాయి సీఈ వరకు స్వతంత్ర నిర్ణయాధికారానికి కేబినెట్ ఆమోదించింది. ఇందులో భాగంగా.. విచక్షణతో కూడిన స్వీయ నిర్ణయాలను తీసుకుని పనులు చేపట్టేందుకు డిఈఈకి ఒక పనికి రూ. 2లక్షలు (సంవత్సరానికి 25 లక్షలు), ఈఈకి 25 లక్షల వరకు(ఏడాదికి 1.5 కోట్లు),  ఎస్ఈ పరిధిలో 50 లక్షలు (సంవత్సరానికి 2 కోట్లు), సీఈ పరిధిలో రూ.1 కోటి వరకు(సంవత్సరానికి 3 కోట్ల వరకు) పనులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అత్యవసర సమయాల్లో ఈ పనులను అవసరమైతే నామినేషన్ పద్దతుల్లో చేపట్టేందుకు అధికారాలను కల్పించింది. ఇందు కోసం ఏడాదికి రూ.129 కోట్లు  ఆర్‌అండ్బీ శాఖ ఖర్చు చేసేందుకు కేబినెట్ అవకాశం కల్పించింది.

ఇదే పద్దతిని అనుసరిస్తూ.. భవనాల విభాగంలో కూడా అత్యవసర సమయాల్లో రిపేర్లు తదితర ప్రజావసరాల కోసం ఖర్చు చేసేందుకు అవకాశం కల్పించింది. అత్యవసర పనులు చేపట్టేందుకు పరిమిత నిధులతో  స్వీయ నిర్ణయాధికారాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు తగ్గట్టుగా నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement