
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు, అర్హులందరికీ ఇళ్లు అనే వాగ్దానాలకు గతి లేకున్నా.. పీఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ల ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది అనడం హాస్యాస్పదమన్నారు.
ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమించిన రైతుల ప్రధాన డిమాండ్ అయిన పంటలకు కనీస మద్దతు ధరపై బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం.. కర్షకులకు నమ్మక ద్రోహం చేసినట్టేనన్నారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తదితర విభజన హామీలను బడ్జెట్‌లో పేర్కొనకుండా.. మరోసారి మోసం చేసిందన్నారు.