ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: పట్టణీకరణతో హైదరాబాద్ మహా నగరం శరవేగంగా విస్తరిస్తోంది. జనాభా పెరుగుదలకు తగ్గట్టు మౌలిక సదుపాయాల్లేక తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో నగరం చుట్టూ కొత్త పట్టణాలను నిర్మించి పట్టణీకరణను వికేంద్రీ కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ కాంప్రెహెన్సివ్ ఇంటి గ్రేటెడ్ టౌన్‌షిప్పుల పాలసీ’ని తీసుకొచ్చింది. ఇంటి నుంచి పని (వాక్ టు వర్క్) ప్రదేశానికి కాలి నడకన వెళ్లాలనే నినా దంతో.. నివాస/ వాణిజ్య/ సంస్థ/వ్యాపార/ కార్యాల యాల సమ్మిళితంగా అచ్చమైన కొత్త నగరాల నిర్మాణా నికి నడుం బిగించింది. నగరంలో ఎక్కడో మూలన నివాసముంటూ.. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజూ లక్షల మంది ట్రాఫిక్‌ను ఎదురీదుతూ నరకాన్ని అనుభవిస్తు న్నారు. గంటల సమయం వృథా అవుతోంది. ఈ సమస్య లకు పరిష్కారంగా టౌన్‌షిప్పుల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పాఠశాల, వైద్యం, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి సదుపాయాలు, అత్యున్నత జీవన ప్రమా ణాలతో వీటి నిర్మాణానికి సమగ్ర విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్య దర్శి అరవింద్‌కుమార్ ఈ నెల 3న ఉత్తర్వులు జారీచేశారు.
ఓఆర్‌ఆర్‌కు 5 కి.మీల ఆవల..
ఓఆర్‌ఆర్‌కు 5 కి.మీ. వెలుపల (నిషేధిత ప్రాం తాలు మినహా) కొత్త టౌన్‌షిప్‌ల నిర్మాణానికే ఈ పాలసీ వర్తిస్తుంది. ప్రస్తుత లేఅవుట్ రూల్స్ వీటికి వర్తించవు. పాలసీలోని నిబంధనలకు లోబడి టౌన్‌షిప్పులకు టీఎస్–బీపాస్ విధానం కింద హెచ్‌ఎండీఏ అనుమతులనిస్తుంది. వచ్చే ఐదేళ్ల పాటు అమల్లో ఉండే ఈ పాలసీని అవసరమైతే సవరణలతో గడువు పొడిగిస్తారు.
పదేళ్లలో టౌన్‌షిప్ నిర్మాణం
ముసాయిదా అనుమతి నాటి నుంచి పదేళ్లలోపు టౌన్‌షిప్పుల నిర్మాణాన్ని పూర్తిచేయాలి. అవస రాన్ని బట్టి ప్రాజెక్టు గడువును పొడిగిస్తారు. టౌన్‌షిప్పులను నిర్మించదలచిన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీలు/ప్రైవేటు డెవలపర్లు/ కంపెనీలు/స్పెషల్ పర్పస్ వెహికల్స్/సంస్థలకు ఈ పాలసీ వర్తించనుంది. వంద ఎకరాలు, ఆపై విస్తీర్ణంలో టౌన్‌షిప్ నిర్మాణానికి ఎంపికచేసే స్థలం కనీసం 30 మీటర్ల రహదారితో అనుసంధా నమై ఉండాలి. 300 ఎకరాలు, ఆపై స్థలాలకు 36 మీటర్ల రహదారి అవసరం. టౌన్‌షిప్ గరిష్ట నిర్మిత స్థలంపై ఎలాంటి పరిమితుల్లేవు. టౌన్‌షిప్ స్థలాన్ని దగ్గర్లోని 30 మీటర్ల రహదారితో అనుసంధానిస్తూ డెవలపర్లు 30 మీటర్ల రహదారిని నిర్మించాలి. మొత్తం సైట్ ఒకేచోట ఉండాలి. అయితే, జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులు సైట్ మధ్య నుంచి వెళ్తుంటే గనుక మినహాయింపునిస్తారు.
సమీకృత వర్క్‌స్టేషన్
రోడ్లు, ఖాళీ స్థలాలు, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలకు కేటాయింపులుపోగా, మిగిలిన స్థలంలో కనీసం నాలుగో వంతు నుంచి రెండో వంతు వరకు స్థలాన్ని ‘వర్క్‌స్టేషన్’ ఏర్పాటుకు కేటాయించాలి. వాణిజ్య కార్యాలయాలు, మార్కెట్, ఐటీ, ఐటీఈఎస్, చిన్నతరహా పరిశ్రమలు, సేవారంగ పరిశ్రమలు, రవాణా కేంద్రం ఇతర ఆహ్లాదకర కార్యకలాపాలతో వర్క్‌స్టేషన్ ఏర్పాటుచేయాలి. 300 ఎకరాలు, ఆపై భారీ విస్తీర్ణంలో నిర్మించే టౌన్‌షిప్పుల్లో కనీసం ఎనిమిదో వంతు స్థలాన్ని వర్క్‌స్టేషన్‌కు కేటాయించాలి. మిగిలిన స్థలంలో సగభాగాన్ని నివాస అవసరాలకు కేటాయించాలి. ప్రధాన వాణిజ్య కేంద్రం, షాపింగ్ ఏరియా, క్లబ్‌హౌస్, కమ్యూనిటీ కేంద్రాలు, లైబ్రరీ.. ఈ ప్రాధాన్య క్రమంలో వాణిజ్య స్థలాన్ని వినియోగించాలి. ఉన్నతవిద్య సదుపాయాన్ని వర్క్‌సెంటర్‌లో కల్పించవచ్చు. టౌన్‌షిప్‌లో అంతర్గతంగా, వెలుపల సమీపంలోని రవాణా సదుపాయం వరకు ప్రజారవాణా (ఎలక్ట్రిక్ వాహనాలు) సదుపాయం కల్పించాలి. నిర్దేశించిన మేరకు ఎల్‌ఐజీ/ ఈడబ్ల్యూఎస్ గృహాలు, రోడ్లు, లే అవుట్‌లో చూపిన మేరకు పచ్చదనం అభివృద్ధి చేయాలి. మొత్తం ప్రాంతంలో 10 శాతాన్ని పచ్చదనానికి కేటాయించాలి. సబ్ స్టేషన్, నీటి సరఫరా సంపులు, మురుగునీటి వ్యవస్థ, వ్యర్థాల నిర్వహణ, పోలీస్‌స్టేషన్/ ఫైర్‌స్టేషన్ ఔట్ పోస్టులు, పబ్లిక్ పార్కింగ్ లాట్స్, శ్మశానవాటికలు, బస్‌స్టేషన్, ఇతర సదుపాయాలను వర్క్ సెంటర్‌లో భాగంగా స్థలం కేటాయించి అభివృద్ధి చేయాలి.
పేదలకు 10 శాతం కోటా
ఆర్థికంగా బలహీనవర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయం వర్గాల (ఎల్‌ఈజీ)కు 10 శాతం ఇళ్లను కేటాయించాలి. అయితే, వీటిని ప్రత్యేక బ్లాకులు/సెక్టార్లుగా నిర్మించవచ్చు.
ప్రణాళికాబద్ధ అభివృద్ధి
నీరు, విద్యుత్ పొదుపు, ఘణ వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి పర్యావరణ అంశాలతో పాటు టౌన్‌షిప్‌ను ప్రణాళికాబద్ధంగా, ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలి. జీరో ఘన వ్యర్థాలు, జీరో వృథా నీరు కాన్సెప్ట్‌తో రీసైక్లింగ్ ప్లాంట్లు నెలకొల్పాలి. బ్లాకులు, సెక్టార్లవారీగా నివాస సముదాయాల్ని నిర్మించాలి. విద్యుత్ పొదుపు భవన నిబంధనలు (ఈసీబీసీ)ను అమలుచేయాలి. భూగర్భ కేబుల్ వ్యవస్థ, అధునాతన పరికరాలతో భద్రత వ్యవస్థ, గ్యాస్ పైప్‌లైన్ వంటి సదుపాయాలుండాలి. పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాలి.
సత్వర అనుమతులు
ప్రాథమిక వివరాలతో టీఎస్–బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోగా తాత్కాలిక అనుమతులు జారీ చేస్తారు. అనంతరం 90 రోజుల్లోగా సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలి. 30 రోజుల్లోగా తుది అనుమతులు జారీ కానున్నాయి. అనుమతులొచ్చిన 6 నెలల్లోగా పనులు ప్రారంభించాలి.
అసోసియేషన్లకే టౌన్‌షిప్పుల నిర్వహణ
టౌన్‌షిప్ రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్ పేరుతో అన్ని టౌన్‌షిప్పులు సలహామండలిని ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణను ఇవి పర్యవేక్షించాలి. డెవలపర్, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన ప్రతినిధులూ దీనిలో ఉండాలి.
టౌన్‌షిప్పుల నిర్మాణానికి ఇవీ ప్రోత్సాహకాలు
– ఫీజు చెల్లిస్తే ఆటోమేటిక్‌గా భూవినియోగ మార్పిడి. గ్రీన్ ఏరియా పది శాతానికి మించితే ఆపై స్థలానికి ఈ ఫీజు మినహాయింపు.
– భూములపై 90 శాతం అభివృద్ధి చార్జీల మినహాయింపు. టౌన్‌షిప్పులో సకల సదుపాయాలను డెవలపరే కల్పించాలి. ప్రభుత్వ ప్రధాన నీటి సరఫరా లైన్‌కు టౌన్‌షిప్‌ను అనుసంధానించడం, మురుగు కాల్వలు, సబ్‌స్టేషన్లు వంటివి డెవలపర్లు అభివృద్ధి చేయాలి. డెవలపర్ డబ్బులు చెల్లిస్తే స్థానిక అర్బన్ అథారిటీ ఈ ఏర్పాట్లు చేసిపెడుతుంది.
– సైట్ ఏరియాలో 10 శాతం (గరిష్టంగా 10 ఎకరాలకు మించకుండా)లోపు ప్రభుత్వ/అసైన్డ్ భూములు వస్తుంటే, ప్రభుత్వం అంత మొత్తంలోని స్థలాన్ని ఇతర చోట తీసుకుని సదరు స్థలాన్ని డెవలపర్‌కు కేటాయిస్తుంది.
– ప్లాన్ మంజూరు సమయంలో చెల్లించాల్సిన ఇంపాక్ట్ ఫీజును ఐదేళ్లకు వాయిదావేస్తారు.
– ఈడబ్ల్యూఎస్/ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మిత స్థలంపై 10 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు మాఫీ. మధ్యతరహా ఆదాయ వర్గాలు (ఎంఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 75 శాతం, ఉన్నత ఆదాయ వర్గాల (హెచ్‌ఐజీ) గృహాల నిర్మిత స్థలంపై 50 శాతం డెవలప్‌మెంట్ చార్జీలు మినహాయింపు.
– టౌన్‌షిప్ నిర్వహణను రెసిడెంట్స్, యూజర్స్ అసోసియేషన్లు పర్యవేక్షించనున్న నేపథ్యంలో క్లబ్‌హౌస్ వంటి మౌలిక సదుపాయాలపై వంద శాతం ఆస్తిపన్నును, ఇతర అన్ని రకాల ఆస్తులపై 50% ఆస్తిపన్నులను ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేసిన తొలి ఐదేళ్ల పాటు రాయితీ కల్పిస్తారు.
– స్టార్ కేటగిరీ హోటళ్లు/ఆస్పత్రులు, మల్టీప్లెక్సులకు రాయితీ, ప్రోత్సాహకాలను అమల్లో ఉన్న ప్రభుత్వ విధానాలకు లోబడి అందిస్తారు.
– అనుమతుల జారీ కోసం స్థలం తనఖా రిజిస్ట్రేషన్‌ను రూ.100 స్టాంప్ పైపర్‌పై నామమాత్రపు ఫీజుతో నిర్వహిస్తారు.
– నాలా చార్జీలను నిబంధనల ప్రకారం చెల్లించాలి.
– క్యాపిటలైజేషన్ చార్జీలు వంద శాతం మినహాయింపు.
– సింగిల్ విండో పాలసీ కింద సమర్పించే అన్ని రకాల దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ 60 రోజుల్లోగా పరిష్కరిస్తారు.
– వర్క్‌స్టేషన్‌లో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాల ఏర్పాటుకు పెట్టుబడులను ఆకర్షించడానికి పరిశ్రమలు, ఐటీ శాఖలు, టీఎస్–ఐఐసీ వంటి ప్రభుత్వ విభాగాలు సహకరిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment