సిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుంటున్న పోలీసులు
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వమే యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ఆందోళనలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నాయకులు బైఠాయించారు.
అసలు సమస్యను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయని నాయకులు ధ్వజమెత్తారు. నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆపి ధాన్యం కొనాలని, పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో అడిషనల్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న కార్యకర్తలు.. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు.
ఖమ్మం, వరంగల్, సిరిసిల్ల కలెక్టరేట్లలోకి వెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వరంగల్‌లో కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. మహబూబాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, ములుగు జిల్లా మంగపేటలో ఎమ్మెల్యే సీతక్క, వనపర్తిలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీసీసీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. పెంచిన ధరలు తగ్గించాలంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొన్నిచోట్ల జాతీయ రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు.
Comments
Please login to add a commentAdd a comment