సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖ కొత్త కొలువులకు మార్గం మరింత సుగమంచేసే పనిలోపడింది. ఇటీవల కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) తొలి నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్ పీఆర్‌బీ) విడుదల చేసింది. ఈలోగా డిపార్ట్‌మెంటు తాను చేయాల్సిన పనులను చకచకా చేసుకుంటూపోతోంది. అన్నింటికన్నా ముందుగా 33 జిల్లాలవారీగా కానిస్టేబుళ్ల పోస్టులను విభజించాల్సి ఉంది. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కొత్తగా డిపార్ట్‌మెంటులో దాదాపు 20వేల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్న క్రమంలో ముందుగా కొత్త జిల్లాల వారీగా కానిస్టేబుళ్ల విభజన ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది.
జిల్లా పోస్టులు కావడంతో.. కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా మల్టీజోన్–1లో కాళేశ్వరం, బాసర, సిరిసిల్ల, భద్రాద్రి జోన్లు, మల్టీజోన్–2 యాదాద్రి, చార్మినార్, జోగుళాంబగా ఏర్పడ్డాయి. ఇందులో ఉమ్మడి 10 జిల్లాల ఆధారంగా స్థానికతను ఆధారంగా నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఉదాహరణకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇపుడు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలుగా విభజించారు. ఈ ఉమ్మడి జిల్లాలో ఎంపికైన కానిస్టేబుళ్లను స్థానికంగా ఉన్న ఖాళీల ద్వారా అక్కడే సర్దుబాటు చేసే వీలుంది. ఇలాగే ఉమ్మడి 10 జిల్లాల్లో ఇదే తరహాలో కానిస్టేబుళ్ల పోస్టులు సర్దుబాటు కానున్నాయి. కొత్త జిల్లాల్లో ఉన్న జనాభా నిష్పత్తి, రిక్రూట్‌మెంట్ అయిన బ్యాచ్‌ల సీనియారిటీ, కానిస్టేబుళ్ల వయసును పరిగణనలోకి తీసుకుంటారు.
పీఆర్‌బీకి సమాచారం ఇలా!
కొత్తగా రాష్ట్రంలో రిక్రూట్ చేయబోయే పోస్టులపై స్పష్టత రావాలంటే ముందుగా ఖాళీగా ఉన్న కానిస్టేబుళ్ల స్థానాల విషయం కొలిక్కి రావాలి. ఆ వివరాలను పోలీస్ రిక్రూట్‌మెంటుకు, ఆర్థిక శాఖకు పంపుతారు. అప్పుడు ఆర్థిక శాఖ ఆమోదం మేరకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment