సాక్షి, హైదరాబాద్: కరోనా లక్షణాలు ఉన్నాయని ఆసుపత్రులకు వెళ్లి క్యూలైన్‌లో నిల్చొవాల్సిన పనిలేదు.. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. లక్షణాలుంటే కుటుంబ సభ్యులు ఎవరికివారు ఇంట్లోనే పరీక్ష చేసుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో ఇంట్లోనే ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు అనుమతించింది.
టెస్ట్ కిట్లను మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు కూడా అనుమతిస్తారు. పరీక్ష చేసుకునే విధానం కిట్ లో ఉంటుందని వైద్య, ఆరోగ్య వర్గాలు పేర్కొన్నాయి. కిట్ ధరను మాత్రం త్వరలో వెల్లడించ నున్నాయి. ఇప్పటికే అమెరికా, యూకే వంటి అనేక దేశాల్లో ఇంట్లోనే పరీక్షలు చేసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆర్టీపీసీఆర్ ఆసుపత్రుల్లోనే..
ఇప్పటివరకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు తదితర చోట్లకు వెళ్లాల్సి వచ్చేది. దాదాపు 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు చేసేవారు. ప్రైవేట్‌లో ఈ టెస్టులు అందుబాటులో లేవు. పది నిమిషాల్లో ఫలితం వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్రంలో 90 శాతం పరీక్షలు ర్యాపిడ్ యాంటిజెన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. రోజుకు వేలల్లో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రులకు వస్తుంటారు.
దీనికోసం లైన్లలో నిలబడటం ప్రయాసగా మారింది. పైగా కరోనా ఉన్నవారు ఇతరులకు అంటించే కేంద్రాలుగా కూడా ఆసుపత్రుల వద్ద పరిస్థితి తయారైంది. తాజా నిర్ణయంతో ఈ ఇబ్బందులన్నీ తగ్గనున్నాయి. కొన్నిచోట్ల అనధికారికంగా కొన్ని లేబొరేటరీల్లో నిర్వాహకులు ఇంటికొచ్చి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. కాగా, ర్యాపిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చి లక్షణాలుంటే మాత్రం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, లేబొరేటరీల్లోనే చేస్తారు.
ఇంటి వద్దకే మందులు..
ఇంట్లో కరోనా పరీక్ష చేసుకున్నవారికి పాజిటివ్ నిర్ధారణ అయితే ఆ విషయాన్ని సంబంధిత ఆసుపత్రికి తెలియజేస్తే, హోం ఐసోలేషన్ కిట్లను ఇస్తారు. ఈ మేరకు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు బాధ్యత తీసుకుంటారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లే ఏర్పాట్లు చేసుకోవాలి. ఎవరికివారు సొంతంగా పరీక్షలు చేయించుకుంటే ఆ వివరాలు ప్రభుత్వానికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి ఎంతమందికి కరోనా సోకిందో పూర్తిస్థాయిలో సమాచారం అందుబాటులో ఉండదన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అలాగే స్వాబ్‌ను సరిగా తీయకుంటే సరైన ఫలితాలు వచ్చే అవకాశం తక్కువని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యశాఖ వద్ద 25 లక్షల మేరకు ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని రెండు కోట్ల వరకు కొనుగోలు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment