
సాక్షి, హైదరాబాద్: ఓ భూవ్యవహారం కేసులో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకో ర్టు ఎదుట హాజరయ్యారు. తాము ఆదేశాలు జారీ చేసినప్పుడు రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సోమేశ్ కుమార్ ప్రస్తుతం సీఎస్ అయినా ఇంకా అమలు కాలేదంటూ కోర్టు అసహనం వ్యక్తం చేసింది. 6 నెలలు గడువు ఇస్తే ఆదేశాలు అమలు చేస్తామని సీఎస్ నివేదించగా ధర్మాసనం నిరాకరించింది.
ఆరు వారాల్లో ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ అమర్‌నాథ్‌గౌడ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశించింది. షేక్‌పేట మండలంలోని సర్వే నంబర్లు 20, 21, 25లోని 59.18 ఎకరాలకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని, ఈ భూమి యజమానుల వారసులకు సంబంధించిన వినతిపత్రాలపై తగిన నిర్ణయం తీసుకోవాలని 2016లో న్యాయమూర్తి.. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు అమలు చేయకపోవడంతో మీర్ ఖుర్షిద్ అలీతోపాటు మరికొందరు కోర్టును ఆశ్రయించారు.