+92 నంబర్‌తో కాలింగ్‌ | Telangana Cyber Crime police issues advisory in view of fake phone calls | Sakshi
Sakshi News home page

+92 నంబర్‌తో కాలింగ్‌

Published Sat, Jul 20 2024 4:52 AM | Last Updated on Sat, Jul 20 2024 4:52 AM

Telangana Cyber Crime police issues advisory in view of fake phone calls

వాట్సాప్‌ డీపీ..

సైబర్‌ కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ..

వాట్సాప్‌ కాల్స్‌తో బెదిరింపులు 

+92 నంబర్‌తో కాల్‌ వస్తే అది మోసమని గుర్తించాలి 

అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలకు దారులు వెతుకుతున్నారు. వాట్సాప్‌ డీపీగా పోలీస్‌ ఉన్నతాధికారుల ఫొటోలను పెట్టుకుని, ఆ నంబర్ల నుంచి పలువురికి వాట్సాప్‌ వాయిస్‌ కాల్స్‌ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బెదిరింపుల వీడియో ఒకటి డీజీపీ జితేందర్‌ తన అధికారిక ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అనుమానాస్పద కాల్స్‌ వస్తే నమ్మి మోస పోకుండా.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణ సీఎస్, డీజీపీ పేరిట గతంలోనూ వాట్సాప్‌ డీపీలతో డబ్బులు డిమాండ్‌
ఈ ఏడాది ఏప్రిల్‌ 30న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫొటోను వాట్సాప్‌డీపీగా పెట్టిన సైబర్‌ నేరగాళ్లు..సీఎస్‌ పేరిట నలుగురు వ్యక్తులకు మెసేజ్‌లు పెట్టారు. అందులో రంజాన్‌ గిప్ట్‌ కూపన్లు పంపాలని కోరడంతో అనుమానాస్పదంగా భావించిన సదరు వ్యక్తులు సీఎస్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.

హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా డీజీపీగా పనిచేసిన సమయంలో ఆయన ఫొటోను డీపీగా పెట్టిన నంబర్‌తో ఈ ఏడాది మే 21న ఓ వ్యాపారికి వాట్సాప్‌ కాల్‌ వెళ్లింది. ‘మీ అమ్మాయిని నార్కోటిక్స్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేశారు. ఆమెను విడుదల చేయాలంటే రూ.50 వేలు మొబైల్‌ పేమెంట్‌ ద్వారా పంపండి అని సైబర్‌ నేరగాళ్లు డిమాండ్‌ చేశారు. దీనిపై తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ ఏడాది మే 23న వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ పి.ప్రావిణ్య ఫొటోను వాట్సాప్‌ డీపీగా పెట్టి కొందరు సైబర్‌నేరగాళ్లు ఆమె పేరిట డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్‌ సిబ్బందితో పాటు కొందరు ప్రజలకు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపారు. విషయం తన దృష్టికి రావడంతో కలెక్టర్‌ వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు..ప్రజలు, అధికారులు ఎవరూ అలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు.

+92 నంబర్‌తో వస్తే అది మోసం..  
మీ వాట్సాప్‌కు పోలీసుల పేరిట బెదిరింపు కాల్స్‌ వస్తే అందులో ఉన్న నంబర్‌ ఏ సంఖ్యతో మొదలైందో గమనించాలి. ఒకవేళ అది +92 నంబర్‌తో వస్తే.. పక్కాగా అది సైబర్‌ నేరగాళ్లపనే అని గుర్తించాలి. వాస్తవానికి +92 కోడ్‌ పాకి స్తాన్‌ది. చాలావరకు ఈ నంబర్‌తో కాల్స్‌ పాకి స్తాన్‌ నుంచే వస్తాయని, కొన్నిసార్లు కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లతోనూ ఇలాంటికాల్స్‌ జనరేట్‌ చేయవచ్చని సైబర్‌ భద్రత నిపుణులు చెబుతున్నారు. 

అనుమానం వస్తే సంచార్‌ సాథీ పోర్టల్‌ దృష్టికి తేవాలి.. 
మీకు తెలియని నంబర్‌ నుంచి +92తో ప్రారంభమయ్యే కాల్‌ వచి్చ.. అందులో అవతలి వ్యక్తి మీ వ్యక్తిగత వివరాలు.. మీ ఆధార్‌ నంబర్, బ్యాంక్‌ లాగిన్‌ వివరాలు లేదా ఓటీపీలు.. ఏవైనా అడిగితే చెప్పవద్దు. అలాంటి అనుమానాస్పద నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే వెంటనే సంచార్‌ సాథీ పోర్టల్‌ (ఠీఠీఠీ. ట్చnఛిజ్చిట ట్చ్చ్టజిజీ.జౌఠి.జీn)‘చక్షు–రిపోర్ట్‌ సస్పెక్టెడ్‌ ఫ్రాడ్‌ కమ్యూనికేషన్స్‌’లో మోసపూరిత సమాచారాన్ని తెలియజేయాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ ప్రజలకు సూచించింది.  

ఫేక్‌ వాట్సాప్‌కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. 
పోలీస్‌ అధికారుల ఫొటోలను డీపీగా పెట్టుకు న్న అపరిచితులు ఫోన్‌ చేసి మీకు సంబంధించి న వాళ్లు పోలీసులకు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్‌ డ్రగ్స్‌ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్‌ కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. – జితేందర్, డీజీపీ, తెలంగాణ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement