ఆ జిల్లాలో నకిలీ కరెన్సీ.. వాళ్లే లక్ష్యంగా దందా! | Telangana: Fake Money Circulation Mancherial | Sakshi
Sakshi News home page

ఆ జిల్లాలో నకిలీ కరెన్సీ.. వాళ్లే లక్ష్యంగా దందా!

Published Tue, Jun 7 2022 10:42 AM | Last Updated on Tue, Jun 7 2022 3:13 PM

Telangana: Fake Money Circulation Mancherial - Sakshi

సాక్షి,మంచిర్యాలక్రైం: జిల్లాలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతోంది. చిరు వ్యాపారులు, రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ముఠా రూ.500, రూ.200 నకిలీ నోట్లను తయారుచేసి యథేచ్ఛగా చలామణి చేస్తున్నారు. ఇందులో అమాయక ప్రజలే తీవ్రంగా మోసపోతున్నారు. కొందరు బడా వ్యాపారులు సైతం దందాకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలన్న అత్యాశతో అడ్డదారుల్లో వెళ్లి కటకటాల పాలవుతున్నారు. నకిలీ కరెన్సీపై అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. పోలీసులు, బ్యాంకు అధికారులు నకిలీ నోట్లను గుర్తించే విధానంపై సామాన్య ప్రజలు, చిరు వ్యాపారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జగిత్యాల పోలీసుల అదుపులో మంచిర్యాల జిల్లా వాసులు
ఈ నెల 5న జగిత్యాల పోలీసులు దొంగనోట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిని మేక శేఖర్, జన్నారం మండలం పుట్టిగూడ గ్రామానికి చెందిన మర్శకోల రాధాకిషన్‌ ఇందులో ప్రధాన నిందితులు కావడం సంచలనం సృష్టించింది. ఇదే ముఠాలో సిద్దిపేట జిల్లా పుల్లూరి గ్రామానికి చెందిన ఎర్రోల్ల శ్రీనివాస్‌గౌడ్, హన్మకొండ జిల్లా మెట్టదామెర గ్రామానికి చెందిన విజ్జగిరి భిక్షపతి, గట్లాదామెర గ్రామానికి చెందిన  విజ్జగిరి శ్రీకాంత్‌ హన్మకొండలో నివాసం ఉంటూ లక్సెట్టిపేట కేంద్రంగా దందా నడిపిస్తున్నారు. ఈ ముఠాకు ప్ర«ధాన పాత్రదారులుగా శేఖర్, రాధాకిషన్‌ వ్యవహరిస్తున్నారు. ఈ నెల 5న లక్సెట్టిపేట నుంచి భిక్షపతి రూ.15 లక్షల దొంగనోట్లు తీసుకుని జగిత్యాలకు రాగా వరంగల్‌ నుంచి శ్రీకాంత్‌ రూ.3 లక్షల అసలు నోట్లు తీసుకుని వచ్చాడు. ఇద్దరూ డబ్బులు మార్చుకుంటుండగా జగిత్యాల పోలీసులకు దొరికిపోయారు. రూ.15లక్షల నకిలి కరెన్సీకి బదులుగా రూ. 3లక్షల అసలు నోట్లు ఇచ్చేందుకు వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకుని దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మంచిర్యాల, గోదావరిఖని, ఆదిలాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాలో మార్పిడి చేసినట్లు సమాచారం. మేక శేఖర్‌ 2004 నుంచి ఈ దందాను కొనసాగిస్తూ పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడు.

మచ్చుకు కొన్ని సంఘటనలు..
2015 అక్టోబర్‌ 31న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు వారి ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సీసీసీ కార్నర్‌లోని పరశురాం నగర్‌కు చెందిన బొ మ్మన రాజశేఖర్‌ మంచిర్యాలలోని సున్నంబట్టి వా డలో ఓ ఇంట్లో నకిలీ కరెన్సీ తయారు చేసేందుకు తన స్నేహితులైన మహదేవపూర్‌ మండలం అన్నారంకు చెందిన బేరం చంద్రయ్య, తాండూర్‌ మండలం అచ్చులాపూర్‌కు చెందిన పూదారిశ్రీనివాస్, కా గజ్‌నగర్‌ మండలం బట్టుపల్లికి చెందిన ముంజ స తీశ్‌ ముఠాగా ఏర్పడి దొంగనోట్లు చలామణి చే స్తున్నట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి ప్రింట ర్, రూ.51,100 నకిలీ నోట్లు స్వాధీనంచేసుకున్నారు.

దొంగనోటును పట్టించిన రంగు..
2019 ఫిబ్రవరి 28న మంచిర్యాలకు చెందిన పత్తి వ్యాపారి మల్యాల జగన్‌మోహన్‌పై నకిలి నోట్ల చలామణి కేసు నమోదైంది. హాజీపూర్‌ మండలం ముల్కల్లకు చెందిన సరిగిరి స్వామి గ్రామాల్లో తిరుగుతూ రైతుల వద్దనుంచి పత్తి కొనుగోలు చేసి జగన్‌కు అమ్మేవాడు. ఈక్రమంలో స్వామికి రూ.లక్షా 30 వేలు ఇచ్చాడు. లక్సెట్టిపేటలోని ఓ హోటల్‌లో టిఫిన్‌ చేసిన స్వామి తడిచిన చేతులతో జగన్‌ ఇచ్చిన డబ్బులనుంచి రూ.50 నోటు ఇస్తుండగా చేతికి రంగు అంటుకుంది. అనుమానం వచ్చిన హోటల్‌ యజమాని స్వామి వద్దనున్న మిగతానోట్లను పరిశీలించి నకిలీ నోట్లుగా గుర్తించాడు. దీంతో జగన్‌మోహన్‌పై కేసు నమోదైంది.
కూరగాయల మార్కెట్‌లో..
2021 జనవరి 9న మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం నర్సింగాపూర్‌ గ్రామానికి చెందిన బోయిని రాజేందర్‌ స్థానిక మార్కెట్‌లో రూ.500ల నకిలీ నో టు ఇచ్చి కూరగాయలు కొనుగోలు చేశాడు. అనుమానం వచ్చిన వ్యాపారి తోటి వ్యాపారులకు చూ పించగా నకిలీ నోటుగా గుర్తించారు. దీంతో రాజేందర్‌ను పోలీసులకు అప్పగించారు. అతనితో పాటు జైపూర్‌ మండలం మద్దులపల్లికి చెందిన అట్ల మ ల్లేశ్, జిరాక్స్‌ మిషన్, రూ.56 వేల విలువైన రూ.500, రూ.200ల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.


నకిలీ నోట్లను గుర్తించండి ఇలా...
  ►  ఒరిజినల్‌ నోటు కలర్‌ థిక్కుగా, కడక్‌ ఉంటుంది.
  ►  నకిలీ నోటు కలర్‌ డల్‌గా ఉంటుంది. కడక్‌ ఉండదు.
  ►  నకిలీ నోటుపై సిల్వర్‌ కలర్‌ లైన్‌ ఉండదు. 
  ►  నోటుపై రిజర్వుబ్యాంకు ముద్రించిన సీరియల్‌ నంబర్‌ గుర్తించాలి.
  ►   గాంధీ బొమ్మ పక్కనే 500 అని ఉంటుంది.దీన్ని గమనించాలి. ఇది నకిలీ నోటుకు ఉండదు.
 ►   ప్రతినోటుపై ముద్రణ సంవత్సరం ఉంటుంది. ఇది లేకపోతే నకిలీ నోటుగా గుర్తించాలి.

 జాగ్రత్తగా ఉండాలి
నకిలీ కరెన్సీ చలామణి చేసేవారు రూ.500 నోటుతో కేవలం రూ.50 విలువ చేసే వస్తువులు కొనుగోలు చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్లి పోతారు. ఇలాంటి సమయంలో వ్యాపారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వారిపట్ల కన్నేసి ఉంచాలి. ప్రతీ వ్యాపారి క్యాష్‌ కౌంటర్‌ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుçకోవాలి. అనుమానం వస్తే 100కు డయల్‌ చేయాలి.
– బి.తిరుపతిరెడ్డి, ఏసీపీ, మంచిర్యాల 

పేపర్‌ మందాన్ని బట్టి గుర్తించాలి
ఒరిజినల్‌ నోటు మందంగా కడక్‌గా, తేజ్‌గా ఉంటుంది. నకిలీ నోటు పేపర్‌ పలుచగా, కలర్‌ డల్లుగా ఉంటుంది. గట్టిగా తడిమి చూస్తే కలర్‌ వేళ్లకు అంటుకుంటుంది. కొత్త నోట్ల కట్టల్లో మధ్యలో ఎక్కడో ఒకటి, రెండు పెడితే సాధారణ పౌరుడు గుర్తించడం కష్టమే. అనుమానం వస్తే సదరు నోట్ల కట్టలు ఎక్కడి కెళ్లి తెచ్చామనేది గుర్తుంచుకోవాలి. దీంతో కొంత ఫలితం ఉంటుంది.                
   – హవేలి రాజు, లీడ్‌ బ్యాంకు మేనేజర్, మంచిర్యాల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement