ఖాళీ పోస్టు ఉంటేనే... క్రమబద్ధీకరణ! | Telangana Finance Ministry Twist On Regularization Of Contract Employees | Sakshi
Sakshi News home page

ఖాళీ పోస్టు ఉంటేనే... క్రమబద్ధీకరణ!

Published Sat, May 14 2022 12:48 AM | Last Updated on Sat, May 14 2022 7:53 AM

Telangana Finance Ministry Twist On Regularization Of Contract Employees - Sakshi

క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ఆర్థిక శాఖ 15 అంశాలతో కూడిన ప్రొఫార్మాను ప్రభుత్వ శాఖలకు పంపింది. వీటిని ఆయా ప్రభుత్వ శాఖలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చి వివరాలు, ఆధారాలను సేకరించాయి.  

ప్రొఫార్మాలోని ఏడవ పాయింట్‌ ప్రకారం.. సదరు కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న పోస్టును ప్రభుత్వం ఏ జీఓ ఆధారంగా మంజూరు చేసిందనే దానికి ఆధారాలను, సంబంధిత వివరాలను సమర్పించాల్సి ఉంది. అయితే మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులు ఈ పాయింట్‌కు సమాధానం ఇవ్వలేదు. 

సాక్షి, హైదరాబాద్‌: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఆర్థిక శాఖ మెలిక పెట్టింది. ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగి పనిచేస్తున్న చోట ప్రభుత్వం అప్పటికే పోస్టు మంజూరు చేసి, అది ఖాళీ (వేకెంట్‌)గా ఉన్నప్పుడే క్రమబద్ధీకరణను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న 11 వేల మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది.  

రాష్ట్ర ఆవిర్భావం నాటికి 11 వేల మంది 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిలో నియమితులైన ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం.. కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారాన్ని సేకరించి ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 11 వేలకు పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొనగా.. వారిలో ప్రస్తుతం ఎంతమంది సర్వీసులో ఉన్నారు?, ఎక్కడెక్కడ ఏయే హోదాలో పనిచేస్తున్నారు? తదితర పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఆ మేరకు ప్రత్యేక ఫార్మాట్‌ను తయారు చేసి ప్రభుత్వ శాఖలకు పంపింది. 

లెక్కలు తేల్చిన శాఖలు 
ప్రొఫార్మా ప్రకారం క్షేత్రస్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగుల నుంచి వివరాలు సేకరించిన ప్రభుత్వ శాఖలు.. లభించిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆయా శాఖల్లో జిల్లాల వారీగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలు, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పోస్టుల ఖాళీలు, రోస్టర్‌ ఆధారంగా అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, రోస్టర్‌ మినహాయింపులతో అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు, మొత్తంగా క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల లెక్కలను ప్రాథమికంగా తేల్చాయి. వాటిని మరోమారు పరిశీలిస్తున్న శాఖలు అతి త్వరలో ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపేందుకు సిద్ధమవుతున్నాయి. 

భారీగా తగ్గుతున్న అర్హులు! 
ప్రభుత్వం గుర్తించిన 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులతో పోలిస్తే.. ప్రభుత్వ శాఖలు గుర్తించిన క్రమబద్ధీకరణకు అర్హత ఉన్న వారి సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ప్రత్యేక నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్ల (సీఆర్‌టీ)ను 2003లో నియమించారు.

ఈ పద్ధతిలో నియామకాలు చేపట్టగా.. తెలంగాణ ఏర్పాటు నాటికి 1,237 మంది ఉన్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. అయితే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కింద ఉన్న ఖాళీలు 901 ఉండగా.. రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్ల వారీగా అర్హత ఉన్న సీఆర్టీలు 159 మంది మాత్రమే కాగా, రోస్టర్‌ మినహాయింపుతో (కొన్నిరకాల సవరణలతో అవకాశం ఉన్నవారు) మరో 42 మందికి అర్హత ఉన్నట్లు గుర్తించింది. మొత్తంగా 201 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హత ఉన్నట్లు అంచనా వేసింది.

అంటే 1,237 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హత సాధిస్తున్నవారు  201 మంది (16 శాతం) మాత్రమేనన్నమాట. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే తరహాలో అర్హతలున్న కాంట్రాక్టు ఉద్యోగుల సం ఖ్యకు భారీగా కోత పడినట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ పెట్టిన మెలిక ఏళ్లుగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మెజారిటీ కాంట్రాక్టు ఉద్యోగులకు నిరాశే మిగల్చనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాలి 
దాదాపు 18 ఏళ్లుగా సీఆర్‌టీలుగా పనిచేస్తున్నాం. ప్రభుత్వ టీచర్ల నియామకానికి సమానంగా అన్ని రకాల అర్హతలను పరిశీలించి మమ్మల్ని నియమించారు. క్రమబద్ధీకరణపై ఆశతోనే అతి తక్కువ వేతనం ఇచ్చినా ఇన్నేళ్లుగా సర్దుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఎంతో సంతోషించాం.

కానీ నామమాత్రంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేస్తే మా సీఆర్టీల్లో దాదాపు 85 శాతం మంది అవకాశాన్ని కోల్పోతాం. వివిధ రకాల మెలికలు పెట్టి కోత పెడితే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. ఈ వయసులో మాకెవరూ ఉద్యోగాలు ఇవ్వరు. కాబట్టి ప్రతి కాంట్రాక్టు ఉద్యోగినీ క్రమబద్ధీకరించాల్సిందే. 
– మాలోతు సోమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షుడు, సీఆర్టీ అసోసియేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement